(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. అనుచిత సమావేశాల వల్లే ఆయన పర్యటనను నిరాకరించామని వివరించింది. దీంతో ‘ఏమిటా.. అనుచిత సమావేశాలు?’ అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు మరికొందరిని సీఎం రేవంత్‌రెడ్డి కలువడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తాజాగా తెలిసింది.
ఈ మేరకు జాతీయ పత్రికలు దైనిక్ జాగరణ్, ది ట్రిబ్యూన్ ఇండియా, ఎన్డీటీవీలో పలు కథనాలు వెలువడ్డాయి. విదేశాంగ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు అనధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఉటంకించాయి. మమ్దానీని కలువనున్న సమాచారాన్ని విదేశాంగ శాఖకు రేవంత్ సర్కార్ తెలియజేయలేదని ఎన్డీటీవీ పేర్కొన్నది. మొత్తంగా మమ్దానీతో భేటీ కారణంగానే సీఎం అమెరికా పర్యటన రద్దయినట్టు తెలుస్తున్నది. అయితే, రేవంత్‌రెడ్డి.. మమ్దానీతో ఏ విషయంపై సమావేశం కావాలనుకొన్నారు? ఈ భేటీని కేంద్రం దగ్గర దాచాల్సిన అవసరమేంటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జొహ్రాన్ మమ్దానీ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మేయర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరానాయర్ పంజాబీ-హిందూ మహిళే కాకుండా ప్రముఖ దర్శకురాలు కూడా. తండ్రి మహ్మద్ మమ్దానీ గుజరాతీ ముస్లిం. భారతీయ మూలాలున్నప్పటికీ జొహ్రాన్ మమ్దానీ భారత్‌కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ‘వార్ క్రిమినల్’గా అభివర్ణించారు. అంతేకాకుండా, పలుమార్లు ఆయన పాకిస్థాన్ మద్దతుదారుడిగా ప్రవర్తించారు. అమెరికాలో ఇటీవల జరిగిన పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మమ్దానీ పాల్గొన్నారు. ఇక, ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
జొహ్రాన్ మమ్దానీపై కాంగ్రెస్ నాయకులు సైతం పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నిరుడు మాట్లాడుతూ.. ‘జొహ్రాన్ మమ్దానీ నోరు తెరిస్తే పాకిస్థాన్ పీఆర్ టీమ్‌కు ఆ రోజు సెలవే. న్యూయార్క్ నుంచి కట్టుకథలను నిజాలుగా వల్లించే ఇలాంటి స్నేహితులు ఉండగా, భారత్‌కు కొత్త శత్రువులు అవసరమే లేదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, సొంత పార్టీ నాయకులు మమ్దానీపై ఇలా విమర్శలు చేస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం మమ్దానీని కలిసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు తెరలేపింది.