Foreign Education | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అసలు వస్తుందా? రాదా? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ఆందోళనకు గురవుతున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి 7 నెలలు గడుస్తున్నా, విదేశాల్లో అభ్యాసం పూర్తయ్యేందుకు సమయం దగ్గరపడుతున్నా తుది జాబితాపై ఇప్పటికీ అతీగతీ లేకుండాపోవడమే ఇందుకు కారణం. మరోవైపు స్కాలర్‌షిప్‌పై ఆశతో అప్పలు చేసి తమ పిల్లలను విదేశీవిద్య కోసం పంపిన తల్లిదండ్రులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుది జాబితా ఎప్పుడు ప్రకటిస్తారని బీసీ సంక్షేమశాఖ అధికారులను అడిగితే.. ప్రభుత్వం నుంచి ఇంకా కొత్త మార్గదర్శకాలు రాలేదని, అవి వచ్చే వరకూ ఏమీ చేయలేమని తేల్చిచెప్తున్నారు.
పేదింటి బీసీ బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులను అభ్యసించేందుకు వీలుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం జనవరి (ఫాల్ సీజన్)లో 150 మంది, ఆగస్టు (స్ప్రింగ్ సీజన్)లో 150 మందికి కలిపి మొత్తంగా 300 మందికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయడంతోపాటు వీసా చార్జీలు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం గరిష్ఠంగా రూ.50 వేల చొప్పున అందజేసింది. కాగా, బీసీ ఓవర్సీస్ పథకం కింద గత ఫాల్ సీజన్‌కే 2,665 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,023 మంది బీసీలు, 642 మంది ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులున్నారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జనవరిలోనే పూర్తయినప్పటికీ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన అర్హుల జాబితాను మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు.
కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించని విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అకడమిక్ మార్కులకు 60%, జీమ్యాట్/జీఆర్ఈ 20%, టోఫెల్, ఐఎల్స్, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చి, ఆ మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ఆయా అర్హతలున్న విద్యార్థులు తమకు తప్పకుండా స్కాలర్షిప్ వస్తుందన్న ధీమాతో విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారు. అదే ధీమాతో పలువురు తల్లిదండ్రులు అప్పులు తెచ్చి తమ పిల్లలను విదేశాలకు పంపారు. ఇలా గత ఫాల్ సీజన్‌కు దరఖాస్తు చేసుకుని విదేశాలకు వెళ్లిన విద్యార్థుల్లో పలువురు ఇప్పటికే 2 సెమిస్టర్లను పూర్తిచేసుకోగా.. మరికొందరికి త్వరలో మూడో సెమిస్టర్ కూడా పూర్తికానున్నది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక సాయం ప్రకటించలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.21 కోట్లు కేటాయించినప్పటికీ రూ.15 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఆ నిధులతో గతంలో ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు సైతం సరిపోని పరిస్థితి నెలకొన్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
వాస్తవానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తవగానే మెరిట్ జాబితాను రూపొందించి స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీకి పంపాల్సి ఉంటుంది. ఆ కమిటీలోని సంబంధిత విభాగం అధికారులతోపాటు, హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూకి చెందిన సభ్యులు అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఫాల్ సీజన్‌కు సంబంధించి మెరిట్ జాబితానే అధికారులు ఇంకా రూపొందించలేదని తెలుస్తున్నది. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మార్గదర్శకాలను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమైనట్టు అధికారులు వెల్లడించారు. ఏటా 300 మందికి కాకుండా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని, విదేశాల్లోని టాప్-500 యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని, పన్ను చెల్లింపుదారులను మినహాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆదేశించినట్టు చెప్తున్నారు. కానీ, అందుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుదిజాబితాను రూపొందించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తున్నది.