ఆత్మకూరు(ఎం), జూన్11: ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన డీ పరశురాములు సర్వీస్ నంబర్ 4620700570 విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.
200 యూనిట్ల లోపే వచ్చే రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఏఈ వివరించారు.