Facebook’s metaverse | అవతార్ సినిమా గుర్తుందా? పండోరా ప్రపంచం రహస్యాలు తెలుసుకొనేందుకు హీరోను పండోరా మనుషుల రూపంలోకి మార్చి పంపిస్తారు. జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఈ టెక్నాలజీ అద్భుతం 2009లో ప్రపంచాన్ని మరో లోకంలోకి తీసుకెళ్లింది. త్వరలో మనం కూడా అవతార్లు కావొచ్చు. రూపం మార్చుకోకపోయినా ఇంటర్నెట్ మాయా ప్రపంచంలో విహరించొచ్చు. చేతిలో స్మార్ట్‌ఫోన్, కండ్లకు 3డీ అద్దాలు ఉంటే చాలు, స్మార్ట్‌ఫోన్‌లో మునిగి నచ్చిన షాపులో తేలొచ్చు. అందులో కలియదిరిగి నచ్చిన వస్తువులు కొనొచ్చు. ఇంట్లో ఉండే మనం పనిచేసే కంపెనీ లాంజ్‌లో నిలబడి కబుర్లు చెప్పొచ్చు. సహోద్యోగులతో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని కబుర్లు చర్చలు చేయొచ్చు. ఇదంతా టెక్నాలజీ మాయ. ఆ మాయే మెటావర్స్ ( metaverse ) ..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో సరికొత్త విప్లవం మెటావర్స్. సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్బుక్ ( Facebook ) తన పేరును మెటాగా మార్చుకొని మెటావర్స్ ( metaverse ) టెక్నాలజీని తన ఖాతాదారులకు అనుభవంలోకి తెచ్చేందుకు ఏకంగా రూ.64 వేల కోట్లు ఖర్చుచేయనున్నట్టు ప్రకటించింది. కానీ, ఐదేండ్ల కిత్రమే హైదరాబాద్ కేంద్రంగా మెటావర్స్ టెక్నాలజీకి బీజం పడింది. ఇమాజినేట్ అనే స్టార్టప్ కంపెనీ గచ్చిబౌలిలో త్రిబుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ)లో మెటావర్స్ ప్రాజెక్టును మొదలు పెట్టింది. వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్యుమెంట్ రియాలిటీ (ఏఆర్)తో పాటు మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్)లతో ఇంటర్నెట్ వేదికపై సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని సృష్టించారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని వర్చువల్ రూపంలో తయారుచేసి, భౌతికంగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లాల్సిన పనిలేకుండా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. రిలయన్స్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీని వర్చువల్ రూపంలోకి మార్చి, ఉద్యోగులకు శిక్షణ, యంత్రాల నిర్వహణ, ఇతర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొనే అవకాశం ఉన్నది. దీనికి మించి ఇంటర్నెట్ ద్వారా ఏం చేయవచ్చో అదే మెటావర్స్. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వెబ్సైట్లలో ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వస్తువులు కొంటున్నాం. మెటావర్స్‌లో అయితే వెబ్సైట్లను మొదట వర్చువల్ రూపంలో తయారుచేస్తారు. కొనుగోలుదారుడు తలకు వీఆర్ హెడ్సెట్ ధరించి త్రీడీ అవతార్ రూపంలో అందులోకి ప్రవేశించి కొనుగోలు చేయవచ్చు. మనం ఓ షాపింగ్‌మాల్‌లోకి వెళ్లి వస్తువులను తాకి చూసి ఎలాగైతే వస్తువులను కొంటామో, మెటావర్స్‌తో సరిగ్గా అలాంటి అనుభూతే కలుగుతుంది. కంపెనీ ఉద్యోగులు ఎవరి ఇంట్లో వారే ఉండి మెటావర్స్‌తో కంపెనీలోని సమావేశ మందిరంలో సమావేశమై చర్చలు జరుపొచ్చు. ఎక్కడో అమెరికాలో ఉండే ఓ కార్పొరేట్ కంపెనీ అధిపతి మెటావర్స్ ద్వారా హైదరాబాద్‌లోని తన కంపెనీ బ్రాంచ్‌లో ఉద్యోగులతో పక్కనే కూర్చొని మాట్లాడొచ్చు. ఇలా ప్రతి రంగంలో మెటావర్స్‌తో సమూల మార్పులు వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే భౌతిక ప్రపంచపు హద్దులు చెరిపేసి కల్పిత ప్రపంచంతో అనుసంధానించేదే మెటావర్స్. ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకొంటున్నది.
ఇమాజినేట్ కంపెనీ ‘మెటా ఫర్ ఎంటర్ప్రైజ్’ పేరుతో మెటావర్స్ టెక్నాలజీతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. వీఆర్, ఏఆర్, ఎంఆర్ టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తులకు, సంస్థలకు అవసరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నది. స్మార్ట్ గ్లాస్ (వీఆర్ హెడ్సెట్), స్మార్ట్‌ఫోన్ ద్వారా వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించి కార్యకలాపాలు నిర్వహించుకొనేలా 3డీ రూపంలో కల్పిత వ్యాపార సంస్థలను సృష్టించింది. ఇప్పటికే ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, ఏవియేషన్, నిర్మాణ రంగం, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, తయారీ రంగాల్లో ఈ టెక్నాలజీతో కార్యకలాపాలు సులభంగా నిర్వహించునేలా డిజైన్ చేసింది. స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఇమాజినేట్ ఇప్పుడు వందల కోట్ల రూపాయల విలువగల కంపెనీగా అవతరించింది.
మెటావర్స్ అనేది ఇంటర్నెట్ ద్వారా సృష్టించబడుతున్న కొత్త ప్రపంచం. ఇప్పటికే వీఆర్, ఏఆర్ పేరుతో ప్రాజెక్టులను పలు కంపెనీలు చేపడుతున్నాయి. దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లేదే మెటావర్స్. ఫేస్బుక్ కంపెనీ తమ వినియోగదారులను ఇంటర్నెట్ ద్వారా కల్పిత ప్రపంచంలోకి తీసుకెళ్లి నేరుగా 3డీ అవతార్ రూపంలో మాట్లాడుకొనేలా చేయవచ్చు. ఇలా ఒక్కో కంపెనీ మెటావర్స్ తమకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం ఉన్నది.
– రమేశ్ లోగ్నాథన్, ఐటీ నిపుణులు
ఇంటర్నెట్ ఆధారంగా మనుషులంతా భౌతిక ప్రపంచంలో మాట్లాడుకున్నట్టే మాట్లాడుకొనే కొత్త కల్పిత ప్రపంచాన్ని సృష్టించటమే మెటావర్స్ టెక్నాలజీ. మేము ఇప్పటికే దీనిపై శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు తయారుచేశాం. వీఆర్ గ్లాసెస్ ధరించి ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించి అక్కడి ప్రతి వస్తువును, ప్రాంతాన్ని చూడవచ్చు.
– హేమంత్ సత్యనారాయణ, ఇమాజినేట్ సీఈవో
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
న్యూ రూల్స్ … జీ మెయిల్ కు లాగిన్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి..
Facebook | అసలు ఫేస్బుక్ ఆపేసిన ఫేసియల్ రికగ్నిషన్ ఏంటి? దీంతో లాభమా? నష్టమా?
best smartphones under 10000 | రూ 10,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!