న్యూస్ నెట్వర్క్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 19,200 క్యూసెకులు ఇన్‌ఫ్లో వచ్చి గోదావరిలో కలుస్తున్నది. వాటిని లింక్- 1, 2లలో 18 మోటర్లను ప్రారంభించి, నీటిని తరలిస్తున్నారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్‌లో ఆరు పంపులను ఆన్ చేసి 13,200 క్యూసెకుల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపుహౌస్‌లో నాలుగు పంపులను ఆన్‌చేసి 11,720 క్యూసెకుల నీటిని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్‌లోని నాలుగు మోటర్లను ఆన్ చేసి 10,440 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన కాళేశ్వరం జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌస్‌కు వెళ్తున్నాయి.
అకడి రెండు మోటర్లను ఆన్ చేసి అండర్ టన్నెల్ ద్వారా 6300 క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అకడి నుంచి టన్నెల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు అండర్ టన్నెళ్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. అకడ రెండు మోటర్లను ఆన్ చేసి 6,300 క్యూసెకుల నీటిని ఎత్తిపోస్తూ అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి షానగర్ శివారులో వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటుచేసిన గేట్లను అధికారులు మూసివేశారు. వరద కాలువకు చేరుకున్న కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా మల్యాల మండలం రాంపూర్ పంపుహౌజ్‌కు తరలివెళ్తున్నాయి. అక్కడి నుంచి పంపులు ఆన్ చేసి.. రాజేశ్వర్‌రావుపేటకు ఎత్తిపోస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్ నుంచి ముప్కాల్ పంపుహౌస్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. రెండు మూడు రోజుల్లోనే కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీకి చేరనున్నాయి.
దేవాదుల పంపింగ్ ప్రారంభం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఒక మోటర్ ద్వారా మంగళవారం పంపింగ్ ప్రారంభించారు. దేవాదుల మోటర్ల ద్వారా గోదావరి నీటితో భీం ఘనపురం రిజర్వాయర్ నింపి రైతుల పంట పొలాలకు నీరు అందించేందుకు సన్నద్ధమయ్యారు. దేవాదుల ఎత్తిపోతలలోని ఫేస్ 3 నుంచి ఒక మోటర్ ద్వారా రోజుకు 294 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.