హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయంలో యువతరం కంకణబద్ధులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని సూచించారు. హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో ఎమెసోబుక్స్ ప్రచురించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు – పల్ల వెంకన్న’ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిషరించారు. ఈ సందర్భంగా హరితహారం ద్వారా మొకల పెంపకాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ఈ పథకం మంచి ఫలితాలు ఇస్తున్నదని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విచ్చలవిడిగా చెట్లు నరకడంవల్ల భూతాపం పెరిగి, ప్రకృతి విపత్తులకు కారణం అవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ తదితరులు పాల్గొన్నారు.