హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేంకటేశ్వరాలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. స్విమ్స్ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు, కాలినడక భక్తులకు వైద్య సేవలు, క్యాంటీన్ల నిర్వహణకు నూతన విధానం, అన్నప్రసాదాలకు 258 మంది సిబ్బంది, కంచి కామకోటిపీఠం సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2కోట్లు ఆర్థికసాయం, సర్వదర్శనం క్యూలైన్లలో రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయం విమానగోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటుకు నిర్ణయించినట్టు వివరించారు.
అన్నప్రసాదానికి కోటి విరాళం ..
స్వామివారి అన్నప్రసాదానికి సూర్యపవన్‌కుమార్ అనే భక్తుడు టీటీడీ ట్రస్టుకు రూ.కోటి 10వేల 116 విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతను అభినందించారు. సోమవారం స్వామివారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారికి రూ.4.15 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు.