చదివింది ఎంఫార్మసీ.. కానీ వ్యవసాయం అంటే ఇష్టం.. ఆ మక్కువతోనే హైదరాబాద్ వదలి ఊరొచ్చేశాడు.. అందరిలా వరి వేస్తే ఏం ప్రయోజనం అనుకొన్నాడు. ఇతర పంటల సాగుతో ఉండే లాభాల గురించి తెలుసుకొన్నాడు. తండ్రి సహాయంతో రకరకాల పంటలు పండిస్తూ ఏటా లక్షల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇతర పంటలతో వచ్చే లాభాన్ని చూపిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన యువరైతు గుండపు సుధీర్.
హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 5: నాలుగు అక్షరం ముక్కలు రాగానే ఉద్యోగం కోసమని పట్నం వైపు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఎంఫార్మసీ చదివిన సుధీర్.. ఉద్యోగాన్ని వదిలేసి, కెనడా వెళ్లే అవకాశాన్ని వద్దునుకొని సొంతూరుకు చేరి ఉన్న ఊళ్లో, భూమిని నమ్మకొని ఇతర పంటల సాగుతో రూ.లక్షలు సంపాదిస్తున్నాడు. చదువుకున్నోడు కదా! వరితో లాభాలు రావని ముందే గ్రహించి, ఇతర పంటల సాగుపై దృష్టిపెట్టాడు. సాంకేతిక పద్ధతులను ప్రయోగిస్తూ, కేవలం మెట్ట పంటలనే పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఐదేండ్లుగా వ్యవసాయంలోనే ఉంటున్నాడు. సుధీర్ కుటుంబానికి గ్రామంలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పక్కనే మరో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొన్నాడు. మొత్తం 35 ఎకరాల్లో పలు పంటలను సాగు చేస్తున్నాడు.
ఇతర పంటలతోనే రైతుకు లాభం
ఊరు కాని ఊరిలో ఎవరి కిందనో పనిచేసే బదులు సొంతూరిలో అయినవారి మధ్య వ్యవసాయం చేయటం సంతోషంగా ఉన్నది. ఈ సారి పెసర, మినుముల్లో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. సాగు చేసిన ప్రతి పంటలో అధిక దిగుబడుల కోసం ప్రయత్నిస్తున్నా. వరితో ఈ లాభాలు రావు. ఇతర పంటలతోనే ఇది సాధ్యమవుతుంది.
దిగుబడుల్లో మొనగాడు
వ్యవసాయం చేయటమే కాదు.. లాభాలు ఎలా రాబట్టాలో తెలిసినోడు సుధీర్. సాంకేతిక పరిజ్ఞ్ఙానాన్ని వినియోగించుకొని ఇతర ప్రాంతాల్లో దిగుబడిని ఇచ్చే వెరైటీలను గుర్తించి, వాటిని తెప్పించుకొని మరీ సాగుచేస్తున్నాడు. తెలుగు రాష్ర్టాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన కదిరి లేపాక్షి 1812 అనే వేరుశనగ రకాన్ని పండించి మంచి దిగుబడిని సాధించాడు. పండిన పల్లికాయ మొత్తాన్ని విత్తనం కోసం అమ్మేశాడు. కూరగాయలను నిత్యం వరంగల్, ఖమ్మం మార్కెట్కు తరలిస్తాడు. తద్వారా ఏటా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాడు. 60 నుంచి 70 శాతం పెట్టుబడి పోగా, మిగతాది లాభమేనని సుధీర్ చెప్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం ఎడ్లు, ముగ్గురు జీతగాళ్లు, ట్రాక్టర్ను వినియోగిస్తున్నాడు. పాల కోసం మూడు బర్లు కూడా ఉన్నాయి. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పనులు చేస్తున్నాడు.