హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో తమ కాన్సులేట్ సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరుగనున్నదని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గతంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కాన్సులేట్ ఉన్నప్పుడు స్థలం కొరత, తక్కువ సంఖ్యలో సిబ్బంది కారణంగా గరిష్ఠంగా రోజుకు 1,100 దరఖాస్తులను ప్రాసెస్ చేసేవారమని చెప్పారు. ఇప్పుడు నానక్‌రామ్‌గూడలో ప్రారంభమైన తమ నూతన భవనంలో 3000-3,500 మంది వరకు సేవలు పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం సిబ్బంది సంఖ్యను క్రమంగా పెంచనున్నట్టు పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల కిందట నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయంలో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి కొత్త భవనం విశేషాలను, ఇతర అంశాలను వివరించారు.
ఈ సమావేశంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, కాన్సులర్ చీఫ్ రెబెకా, మేనేజ్మెంట్ ఆఫీసర్ ఆండ్రూ మేయర్, పొలిటికల్, ఎకనామిక్ సెక్షన్ చీఫ్ సీన్ రూత్, పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12 ఎకరాల్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. 340 మిలియన్ డాలర్ల వ్యయంతో, ఆధునిక టెక్నాలజీతోపాటు అమెరికా, హైదరాబాద్ సంప్రదాయ నిర్మాణశైలి కలబోసి రూపకల్పన చేసినట్టు చెప్పారు. భవన నిర్మాణం, నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం మరిచిపోలేమని అన్నారు. హైదరాబాద్- అమెరికా మధ్య ఏరోస్పేస్, ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో విడదీయలేని అనుబంధం ఉన్నదని చెప్పారు. ఇది మరింత దృఢమవుతున్నట్టు తెలిపారు.
తమ కాన్సులేట్ కార్యాలయంలో విద్యార్థి, టూరిస్ట్ వంటి వీసా ఇంటర్వ్యూలతోపాటు ఇక్కడ నివసిస్తున్న, అలాగే తెలంగాణ, ఏపీ, ఒడిశాకు పర్యాటకం కోసం వచ్చే అమెరికా పౌరులకు సేవలు అందిస్తామని లార్సన్ చెప్పారు. ఆయా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి గతంలో 16 కౌన్సిలర్ విండోలు (కౌంటర్లు) మాత్రమే ఉండటంతో సేవలు ఎక్కువ మందికి అందలేదన్నారు. కొత్త భవనంలో 54 కౌన్సిలర్ విండోలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిద్వారా గరిష్ఠంగా 3500 మంది వరకు సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అయితే.. ప్రస్తుతం కౌన్సిలర్ విండోలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదన్నారు. అన్ని విండోల ద్వారా సేవలు అందించేలా సిబ్బంది సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్టు వెల్లడించారు. సామర్థ్యం పరంగా దక్షిణాసియాలోనే అతిపెద్ద క్యాంపస్‌గా తమ కాన్సులేట్ రికార్డు సృష్టించిందని చెప్పారు.
తాత్కాలిక ఉద్యోగాల కోసం నిరుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్లిన దక్షిణాసియా వాసుల్లో 70 శాతం మంది భారతీయులేనని లార్సన్ చెప్పారు. దేశంలోని ఐదు కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో కలిపి ఈ ఏడాది కనీసం 10 లక్షల మంది భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మొదటిసారి ఇంటర్వ్యూకు వచ్చేవారికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థి వీసాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గతంలో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వీసా ఇంటర్వ్యూలకు ఏడాది, రెండేండ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆరు నెలలలోపే ఇంటర్వ్యూలు పూర్తవుతున్నాయని తెలిపారు. వీసా రెన్యువల్ కోసం కార్యాలయంలో ‘డ్రాప్ బాక్స్’ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. దరఖాస్తులు అక్కడ వేసి వెళ్తే 4-6 వారాల్లో అధికారులు పరిశీలించి వీసా మంజూరు చేస్తారని చెప్పారు. అమెరికాలో చదువులు, వీసాలు ఇతర సంబంధ సేవల కోసం జూబ్లీహిల్స్‌లో ‘వై-యాక్సిస్’ ఫౌండేషన్ కార్యాలయం అందుబాటులో ఉన్నదన్నారు. ఏ అనుమానాన్ని అయినా ఉచితంగా తీర్చుకోవచ్చని తెలిపారు.