హైదరాబాద్/గజ్వే ల్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో అడవుల అభివృద్ధి బాగున్నదని, పచ్చదనాన్ని గొప్పగా పెంచారని కొనియాడారు. ఆయన నేతృత్వంలో యూపీ అటవీశాఖ ఉన్నతాధికారులు శనివారం తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అటవీశాఖ సలహాదారు ఆర్ శోభతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన అడవులతోపాటు పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్ (కండ్లకోయ ఆక్సిజన్ పార్), ఔటర్ రింగ్ రోడ్లో పచ్చదనాన్ని పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మారెట్ను, జప్తి సింగాయిపల్లి, ములుగులోని నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను, ములుగులోని అటవీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా యూపీ మంత్రి అరుణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ గురించి చాలా గొప్పగా విన్నామని, అడవులను విస్తృతంగా అభివృద్ధి చేసినట్టు తెలుసుకొని చూసేందుకు వచ్చామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయన్నారు. అధికారులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేయడం.. వాటిలో పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దల కోసం ఓపెన్ జిమ్ తదితర వసతులు ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో చెట్లను పెంచడం, అడుగడుగునా పచ్చదనాన్ని భారీగా పెంపొందించడం అద్భుతంగా ఉన్నదన్నారు. కొత్తగా నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డును ఏర్పాటుచేసి సంరక్షించడం పర్యావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మక్కువను చాటుతున్నదని ప్రశంసించారు. తెలంగాణలో తమకు ఎక్కడా మొక్కలులేని స్థలమే కనిపించలేదని, ఎటు చూసినా పచ్చదనమే దర్శనమివ్వడంతో మనసు పులకరించిందని తెలిపారు. ఈ పర్యటన ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపుపై చాలా విషయాలు తెలుసుకొన్నామని చెప్పారు.