హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చికిత్స పొందుతున్న చిన్నారులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు యూకేకి చెందిన వైద్య బృందం ఈ నెల 24న నగరానికి రానున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, థోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్రావు తెలిపారు. ‘చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ పేరుతో బ్రిటన్ వైద్యనిపుణులు డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు చేయనున్నట్టు వివరించారు. అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి ఐదేండ్లలోపు వయసున్న దాదాపు 10 నుంచి 15 మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయనున్నట్టు వెల్లడించారు. 10 మంది సభ్యుల బ్రిటన్ వైద్యబృందం నిర్వహించే క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో నిమ్స్తోపాటు నిలోఫర్ వైద్య బృందం కూడా పాల్గొననున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.