అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని యూనియన్ కౌంటిలోని ఇల్లినాయిస్ రూట్ నెం.3 దగ్గర గురువారం రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదుటి కారు డ్రైవర్ కూడా మరణించారు.
ఈ యువకులు సదరన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ కార్బన్డోల్లో చదువుకుంటున్నారు. వంశీకృష్ణ పెచ్చెట్టి (23) నగరంలోని నిజాంపేట్‌కు చెందినవాడు. వంశీకృష్ణ మరణ వార్త వినగానే రెడ్డి రెవిన్యూలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక… ఈ ప్రమాదంలో మరణించిన మరో విద్యార్థి పవన్ స్వర్ణ స్వస్థలం ఖమ్మం. కల్యాణ్ ద్రోణ, కార్తిక్ కాకుమాను, యశ్వంత్ ఉప్పలపాటి గాయపడిన వారిలో వున్నారు.
ఈ ప్రమాదంపై వంశీకృష్ణ పిచ్చెట్టి సోదరుడు శశికిరణ్ పెచ్చెట్టి స్పందించారు. ఓ కారు మా సోదరుడి కారుకి ఎదురుగా వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ దురదృష్టమైన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వంశీ డ్రైవర్ వెనక సీటులో కూర్చున్నాడు. వీరందరూ కార్బన్డోల్లోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్నారు అంటూ వంశీకృష్ణ సోదరుడు శశికిరణ్ పిచ్చెట్టి తెలిపారు. ఇక.. ఈ ఇద్దరు విద్యార్థుల మృతికి యూనివర్శిటీ కూడా సంతాపం తెలిపింది.