బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 13:27:12

వికారాబాద్‌లో విషాదం.. క‌ల్తీ క‌ల్లు తాగి ఇద్ద‌రు మృతి

వికారాబాద్‌లో విషాదం.. క‌ల్తీ క‌ల్లు తాగి ఇద్ద‌రు మృతి

వికారాబాద్ : జిల్లాలో క‌ల్తీ క‌ల్లు క‌ల్లోలం సృష్టించింది. క‌ల్తీ క‌ల్లు సేవించ‌డంతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న న‌వాబ్‌పేట మ‌డ‌లంలోని ప‌లు గ్రామాల్లో చోటు చేసుకుంది. చిట్టిగిద్ద గ్రామంలో, పెండ్లిమ‌డుగు గ్రామంలో ఒక్కొక్క‌రి చొప్పున మృతి చెందారు. ఈ క్ర‌మంలో చేవెళ్ల‌, వికారాబాద్ ఎమ్మెల్యేలు కాలే యాద‌య్య‌, మెతుకు ఆనంద్ ఆ గ్రామాల్లో ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఈ రెండు గ్రామాల‌తో పాటు ఎర్ర‌వ‌ల్లి, వ‌ట్టిమిన‌ప‌ల్లి, ఏమామిడి, ఆర్క‌త‌ల గ్రామాల్లో కూడా 100 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని వైద్యాధికారుల‌కు ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

క‌ల్లు దుకాణాలు సీజ్‌

క‌ల్తీ క‌ల్లు సేవించి ఇద్ద‌రు మృతి చెందిన నేప‌థ్యంలో అబ్కారీ శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌య్యారు. ఏయే గ్రామాల్లో అయితే జ‌నాలు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారో అక్క‌డున్న క‌ల్లు దుకాణాల‌ను సీజ్ చేశారు. క‌ల్లును సేక‌రించిన అధికారులు ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. జ‌నాలు అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు దృష్టి సారించారు. 

క‌ల్లు తాగొద్దంటూ చాటింపు

ఇద్ద‌రు మృతి చెంద‌డం, వంద మందికి అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌తో పాటు ఇత‌ర గ్రామాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌ల్లు తాగొద్దంటూ డ‌ప్పుతో చాటింపు వేయించారు. ఒక వేళ క‌ల్లు ఉంటే దాన్ని పార‌బోయాల‌ని, తాగొద్ద‌ని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని గ్రామ‌స్తుల‌కు పిలుపునిచ్చారు.


logo