హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్వీసులకు చెందిన ఇద్దరు గ్రూప్-1 అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. గత ఏడాది రాష్ట్రానికి చెందిన అయిదుగురు అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్ సాధించగా.. ఈ సారి ఇద్దరు అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. వారిద్దరు వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్లుగా పనిచేస్తున్న జీ ఫణీందర్ రెడ్డి, కే సీతాలక్ష్మి అని యూపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు ఐఏఎస్ ఖాళీల భర్తీ కోసం నుంచి పది మంది పేర్లను కేంద్రానికి పంపించింది. ఇంటర్వ్యూ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ సభ్యులుగా ఉండగా.. యూపీఎస్సీ నుంచి సుమన్‌శర్మ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. వీరు తెలంగాణ నుంచి మొత్తం పది మంది హాజరైతే ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖకే చెందిన అధికారులను ఎంపిక చేశారు.
ఏడాదిలో ముగ్గురు అక్కడి నుంచే!
రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఐఏఎస్‌కు వెళ్లేవారు చాలా తక్కువగా ఉంటారు. గ్రూప్-1లో సీనియర్‌గా ఉన్నవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపుతుంది. అన్ని డిపార్ట్మెంట్లలో బాగా పనిచేసిన వారిని గుర్తించి వారి పేర్లను ఇంటర్వ్యూ కోసం యూపీఎస్సీకి పంపుతారు. యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురిని ఇంటర్వ్యూబోర్డులో సభ్యులుగా చేరుస్తుంది. ఒక అభ్యర్థి ఎంపికలో ఈ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. గత ఏడాది అయిదు పోస్టులు ఖాళీ అయితే.. వీటికి 25 మందిని ఇంటర్వ్యూ కోసం పంపారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. వీరిలో హరిత అనే గ్రూప్-1 అధికారి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన వారే. ఈ సారి రెండు ఖాళీలకు ఎంపికైన ఇద్దరు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన వారు కావడం గమనార్హం.
సీనియర్ల గుర్రు..
కొత్తగా ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా రావడంపై ఇప్పటివరకు అనేకసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు వెళ్లివచ్చిన అధికారులు గుర్రుగా ఉన్నారు. ఈసారి ఐఏఎస్ హోదా వచ్చినవారు మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. వారిద్దరు తెలంగాణేతరులు అన్న ప్రచారం సోషల్ మీడియాలో బలంగా సాగుతున్నది. వీరిద్దరి కన్నా మెరిట్‌లిస్టులో పైస్థానాల్లో ఉన్న వేముల శ్రీనివాసులు, యాదగిరిరావు, చంద్రశేఖర్‌రెడ్డి, వీ సైదా వంటివారిని విస్మరించారన్న వాదన అధికారుల్లో వినిపిస్తున్నది. ఇప్పుడు ఎంపికైన ఫణీందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారికి దగ్గరి బంధువు అన్న చర్చ కూడా వినిపిస్తున్నది.