TS Group 2 | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. పోలింగ్‌కు, ఇటు పరీక్షలకు పెద్ద ఎత్తున పోలీసులతో పాటు ఇతర శాఖల సిబ్బంది కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఈ ఎన్నికల నేపథ్యం గ్రూప్-2 పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చైర్మన్ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీఎస్పీఎస్సీ సమావేశమైంది.
ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ కష్టమని భావించిన టీఎస్పీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వాయిదా వేసిన పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. 783 గ్రూప్-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగాల్సి ఉండగా.. నవంబర్ 2, 3 తేదీలకు వాయిదాపడ్డాయి. పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే, పరీక్షల కోసం 1600 సెంటర్లు అవసరం అవుతాయరని, దాదాపు 25వేల మంది పోలీసులు, మరో 20వేల మందికిపైగా పరీక్షల కోసం సిబ్బంది అవసరం అవుతారని టీఎస్పీఎస్పీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఓ వైపు ఎన్నికలకు, మరో వైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో సుధీర్ఘంగా చర్చించిన టీఎస్పీఎస్పీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది.
Tspsc Note