మహబూబాబాద్ రూరల్, జూన్ 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నదని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం మహబూబూబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి ప్రత్యేక చొరవతో దళితబంధు పథకం అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో డప్పు కొట్టే వారికి చెప్పులు కుట్టే వారికి పింఛన్ అందచేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు కే ఎల్లయ్య, మోహన్, సంజీవ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.