హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలతో దుష్ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రజల్లో ఆదరణలేని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని దొంగ సర్వే సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో పార్థాదాస్ అనే యువకుడితో కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలు చేయిస్తున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రేకు పార్థాదాస్ సన్నిహితుడని, గతంలో కూడా ఆయన బీఆర్ఎస్పై ఇలాంటి విషప్రచారమే చేశారని గుర్తుచేశారు. సీ ఓటర్ సర్వే అంటే కాంగ్రెస్ ఓటర్ సంస్థగా మారిందని ధ్వజమెత్తారు. 2018లోనూ ఇలాంటి దొంగ సర్వేలు సృష్టించారని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారంలోకే రాదని గోబెల్స్ ప్రచారం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఫేక్ సర్వేలు సృష్టించినా రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.