Kieron Pollard : వెస్టిండీస్ (Westindies) విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డును తన పేరిట ఉంచుకున్న సహచర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) ను పొలార్డ్ అధిగమించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ఈ ఘనత సాధించాడు. డల్లాస్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడిన పొలార్డ్.. అజేయ శతకంతో (100* పరుగులు, 56 బంతుల్లో) చెలరేగాడు.
ఈ ఇన్నింగ్స్‌తో అతను టీ20ల్లో తన మొత్తం పరుగుల సంఖ్యను 14,582 కు పెంచుకున్నాడు. దాంతో 14,562 పరుగులతో పదేళ్లకుపైగా (4,463 రోజులు) అగ్రస్థానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 245 పరుగులు చేయగా.. పొలార్డ్ సెంచరీ చేసినప్పటికీ ఎంఐ న్యూయార్క్ 215 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 39 ఏళ్ల పొలార్డ్ తన సుదీర్ఘ కెరీర్లో 736 టీ20 మ్యాచ్‌లు ఆడి ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్లో 10,000కు పైగా పరుగులు, 300కుపైగా వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడిగానూ అతనికి అరుదైన రికార్డు ఉంది.
ఎక్కువగా ఫినిషర్ పాత్ర పోషించే అతను, నెంబర్ 5 లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 10 వేలకుపైగా పరుగులు చేయడం విశేషం. ఈ వయసులోనూ అత్యున్నత స్థాయిలో రాణిస్తూ పొలార్డ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
.