హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : కొంతకాలంగా డిమాండ్ పడిపోయిన టీఎస్ఎంసెట్కు ఏటేటా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మూడేండ్లుగా పెరుగుతున్న దరఖాస్తులు ఈసారి మరింతగా నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ ఏడాది ఎంసెట్‌కు 2,61,616 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది కంటే ఈసారి10 వేల దరఖాస్తులు పెరిగాయి. నాలుగేండ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు ఉండగా, వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
కొనసాగతున్న స్వీకరణ..
ఎంసెట్‌తో పాటు మరో ఐదు ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ కొనసాగుతున్నది. విద్యాప్రణాళికలలో ముందంజలో ఉన్న తెలంగాణ గత రెండేండ్లతో పోల్చితే ఈ ఏడాది ముందుగానే నోటిఫికేషన్లను విడుదల చేసింది. అన్ని రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ప్రకటించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఐసెట్, లా, పీజీలాసెట్‌కు దరఖాస్తుల నమోదు ఆశాజనకంగా కొనసాగుతున్నది.