శంషాబాద్ రూరల్, మే 15: ఒకరోజు రాత్రి మట్టి పోస్తారు.. మరో రోజు రాత్రి చదును చేస్తారు.. కొన్నాళ్ల తర్వాత దానిపై దుకాణాలు తెరుస్తారు.. అంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇదేదో అభివృద్ధి కార్యక్రమం కాదు.. అధికార యంత్రాంగం కండ్ల ముందే ఇరవై ఎకరాల చెరువు గొంతు నులిపే కబ్జా కథ. అటు రెవెన్యూ.. ఇటు ఇరిగేషన్ అధికారులు నోరు మెదపరు.. ప్రజాప్రతినిధులే వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న ఆక్రమణపర్వంతో శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ పరిధిలో ఉన్న సుంతరోని చెరువు కాలగర్భంలో కలిసే ప్రమాదం పొంచి ఉన్నది.
శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుంతరోని చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎగువన పెద్ద షాపూర్, ఘాంసీయాగూడ, చౌదరిగూడ చెరువులకు అనుసంధానంగా ఉన్న ఈ గొలుసుకట్టు చెరువు హిమాయత్‌సాగర్‌కు అతి సమీపంలో ఉంటుంది. చెరువు నీటితో కళకళలాడుతుండడంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ చెరువు సమీపంలో కొంతభూమిని కోనుగోలు చేసిన కొందరు మొదట దేవాలయం నిర్మించారు. నెమ్మదిగా ఈ చెరువును మట్టితో పూడ్చి.. దేవాలయానికి వచ్చే భక్తులకు మూత్రశాలలు, దుకాణాల సముదాయం, రోడ్డు పేరుతో దాదాపు 20 గుంటలకుపైగా చెరువును కబ్జా చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మరో అడుగు ముందుకేశారు. కొంతకాలంగా రాత్రివేళల్లో మట్టి తెచ్చి నెమ్మదిగా చెరువును మళ్లీ పూడ్చటం మొదలుపెట్టారు. ఇలా చెరువు మధ్యలోనే ఏకంగా ఒక కట్టలా మట్టిని పోసి… రోడ్డును ఏర్పాటు చేశారు. దీని ద్వారా క్రమంగా చెరువులో నీళ్లు పోయి ఒట్టిపోతుందనేది అక్రమార్కుల వ్యూహంగా కనిపిస్తుంది. పైగా చెరువులో నీళ్లు నిల్వ ఉండకుండా చెరువు కట్టను కూడా ధ్వంసం చేశారు. నాలుగు రోజల నుంచి రాత్రి సమయంలో మట్టిని తీసుకు వచ్చి చెరువులో నింపుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం :దుద్యా నాయక్, ఇరిగేషన్ డీఈ
సుంతరోని చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ ఇరిగేషన్ శాఖ డీఈ దుద్యా నాయక్‌ను సంప్రదించగా.. చెరువును కబ్జా చేస్తున్నట్టుగా సమాచారం వచ్చిందని, ఆ ఫిర్యాదుపై పరిశీలన చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.