Etamatam | ఇచ్చేటోడు ఉంటే…చచ్చేటోడు లేచొస్తాడని సామెత. కాంగ్రెస్ సీనియర్ నేత ‘పెద్దలు జానారెడ్డి’ వాలకం చూస్తే అచ్చం అలాగే ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చాక జానన్న ైస్టెలే మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో కాబోయే సీఎం క్యాండెట్ నీవే… అని హస్తినలో ఎవరో పెద్ద నాయకుడు బత్తి ఎక్కించాడట. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ గెలిస్తే సీఎం క్యాండెట్‌ను నేనేనంటూ జానారెడ్డి కాక రేపుతున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే సీఎం రేస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండగా తాజాగా అందులో జానారెడ్డి కూడా చేరిపోయారు.
వాస్తవానికి నాగార్జునసాగర్‌లో ఓడిపోయాక రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. కానీ ఢిల్లీ పెద్దలు మిమ్మల్నే సీఎం క్యాండెట్ అనుకుంటుంటే…మీరేమో మా ఇద్దరు అబ్బాయిలకు టికెట్ కావాలని అడుగుతున్నారేంటి?… అని సదరు నేత ప్రశ్నించారట. దానిదేముందిలే, ముందు నన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టండి…అప్పుడు మా అబ్బాయిని రాజీనామా చేయించి బై ఎలక్షన్లో పోటి చేస్తానని తన మాస్టర్ ప్లాన్ బయట పెట్టారట జానారెడ్డి కాకా. ఇక అప్పటి నుంచి సీఎంగా తనకే అవకాశం ఉందని పెద్దలు జానారెడ్డి చెప్పుకుంటుంటే…అదో పెద్ద జోక్ అని కోమటిరెడ్డి కొట్టిపారేస్తున్నారట. జానారెడ్డి మాత్రం తాను సీఎం కావద్దని ఎక్కడుంది?… కాలం కలిసొస్తే ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’… ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకుంటూ తెగ స్పీడ్ మీదున్నారు జానారెడ్డి కాకా.
– వెల్జాల