తొర్రూరు, నవంబర్ 18 : ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు జప్తుకు ఆదేశాల మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవో కార్యాలయ ఆస్తులను బాధిత రైతులు జప్తుచేశారు. ఎస్సారెస్పీ డీబీఎం 69ఎల్ కాల్వ నిర్మాణానికి దంతాలపల్లి మండలంలో 2009-10లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. గ్రామానికి చెందిన సాధు ధర్మారెడ్డి, కొరిపల్లి వెంకన్న, కొరిపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 9 ఎకరాల గుండా ఎస్సారెస్పీ కెనాల్ (డీబీఎం-69ఎల్) నిర్మాణం కారణంగా తగిన నష్టపరిహారం అందలేదని 2011లో జిల్లా కోర్టును ఆశ్రయించారు.
రైతుల తరఫున న్యాయవాదులు నరేందర్, అఫ్జల్ రెహమాన్ వాదించగా, 2024లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ రైతుల పక్షాన తీర్పు వెలువరించారు. రూ. 2.47కోట్లు రైతులకు చెల్లించాలని ఆర్డీవో ను ఆదేశించారు. ఆర్డీవో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ పరిహారం చెల్లింపులో పు రోగతి లేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం 50%రైతుల ఖాతా ల్లో జమ చేయాల్సి ఉన్నా, అధికారులు కాలయాపన చేయడంతో అక్టోబర్ 8న కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రైతులు కార్యాలయ ఆస్తులను జప్తుచేశారు.