హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశ దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనున్నది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గత నెల 9వ తేదీన ప్రారంభమైనట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ శనివారం వెల్లడించింది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23న తెలంగాణవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్నవారు, ఓసీ, బీసీ విద్యార్థులైతే తొమ్మిదేండ్లు పూర్తయి, 11 ఏండ్ల వయస్సు దాటనివారు, ఎస్సీ, ఎస్టీ పిల్లలు 13 ఏండ్లు దాటకుండా, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే 1.50 లక్షలు, పట్టణాలైతే రూ.2 లక్షలు మించకూడదని వివరించింది. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678 నంబర్లో సంప్రదించాలని, www.tgcet.cgg.gov. in, www.tswries.ac.in <http:// www.tswries.ac.in> వెబ్సైట్లను చూడాలని సూచించింది. ప్రవేశ పరీక్ష మెరిట్, ఆయా గురుకులాల నిర్దేశిత రిజర్వేషన్ల ప్రకారం అడ్మిషన్లు కల్పించనున్నట్టు స్పష్టంచేసింది.