ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:48

కరోనా నెగిటివ్‌ ఉంటేనే శబరిమలకు..

కరోనా నెగిటివ్‌ ఉంటేనే శబరిమలకు..

  • 15 నుంచి భక్తులకు అనుమతి 
  • దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నెగిటివ్‌ ఉంటేనే శబరిమలకు యాత్రకు అనుమతి లభిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ నెల 15 నుంచి శబరిమల యాత్రను నిర్వహించనున్నట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. వారంలో ప్రతిరోజు వెయ్యి మంది, వారం చివరి రోజున రెండు వేల మందిని అనుమతించనున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్‌ సోకిన వారు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉన్న భక్తులు యాత్రలో పాల్గొనరాదన్నారు. 

శబరిమల యాత్రకు సిద్ధంకండిలా.. 

  • యాత్రకు వెళ్లే భక్తులు sabarimalaonline.org పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. 
  • 48 గంటల ముందు తీసుకున్న కరోనా నెగిటివ్‌ ధ్రువీకరణ పత్రం ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 
  • శబరిమల ప్రవేశ ద్వారం వద్ద కొంత రుసుము తీసుకుని యాంటీజెన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగిటివ్‌ వస్తేనే లోనికి అనుమతిస్తారు. 
  • పదేండ్లలోపు వారిని, అరవై ఐదేండ్లు పైబడిన వారిని, అనారోగ్య సమస్యలున్న భక్తులను అనుమతించరు. 
  • శబరిమల యాత్రికులు తమతోపాటు బీపీఎల్‌ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. దారిలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • భక్తులు నెయ్యితో అభిషేకం, పంబానదిలో స్నానం చేయడంపై నిషేధం విధించారు.
  • సన్నిధానం సహా పంబా నది తీరాన, గణపతి మందిరంలో రాత్రి నిద్రకు అనుమతించరు. 
  • దర్శనానికి వచ్చే యాత్రికులు ప్రయాణించే దారులపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  కేవలం ఎరుమెలి, వలుసిరికర్ర రెండు మార్గాల నుంచి మాత్రమే వెళ్లాలి.