బీఆర్ఎస్లోకి టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నారు.
- వీఆర్ఎస్కు దరఖాస్తు చేసిన రాజేందర్
- త్వరలో కేసీఆర్ సమక్షంలో చేరిక
- వీఆర్ఎస్ను ధ్రువీకరించిన రాజేందర్
- సీఎం కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న ఆయన ఈ మేరకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. రాజేందర్ శుక్రవారం వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ను కలిసి వీఆర్ఎస్ దరఖాస్తు సమర్పించారు. సోమవారం వీఆర్ఎస్ ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని రాజేందర్ ధ్రువీకరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పిలుపుమేరకు పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాజేందర్ స్వస్థలం సంగారెడ్డి కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్నారు. రాజేందర్ రెండేండ్ల సర్వీస్‌ను వదులుకొని వీఆర్ఎస్కు దరఖాస్తు సమర్పించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గం మద్దతును కూడగట్టేందుకు అధిష్ఠానం ఆదేశాల మేరకే మామిళ్ల రాజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. రాజేందర్ వీఆర్ఎస్ తీసుకోవడంతో టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే టీఎన్జీవో సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి, నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల నేతగా..
చదువుకునే రోజుల్లో విద్యార్థి నేతగా రాణించిన రాజేందర్.. చదువుల అనంతరం 1987 జనవరిలో వైద్యారోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. సిద్దిపేట జిల్లాలో పనిచేసిన ఆయన సుధీర్ఘకాలం ఉద్యోగసంఘాల నేతగా కొనసాగారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలందించారు. అప్పట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేసినప్పటి నుంచే రాజేందర్‌కు సాన్నిహిత్యం ఏర్పడింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ.. నల్లబ్యాడ్జీలు పెట్టకుండా.. నిరసనలు వ్యక్తంచేయకుండా ఉద్యోగులకు పెద్దన్నలా ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు, అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. ఉద్యోగులకు రెండు పీఆర్సీలు ఇప్పించడం, కీలకమైన ఈహెచ్ఎస్ అమలుకు కృషిచేశారు. అనేకసార్లు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో ఉన్న అనుబంధం దృష్ట్యా రాజకీయ ఆరంగ్రేటం చేయాలని రాజేందర్ నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా
ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసింది నిజమే. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరుతా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషిచేస్తా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతుతోపాటు ముదిరాజ్‌ల మద్దతు కూడగట్టి సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తా. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు.
– మామిళ్ల రాజేందర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

