దామెర, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు ఫోరం అని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. టీజేఎఫ్ ఆవిర్భవించి మే 31 నాటికి 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహణకోసం టీయూడబ్ల్యూజే- హెచ్143 ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మలిదశ ఉద్యమ పోరాటంలో 2001లో నాటి టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న నెలరోజులకే పుట్టిన మొట్టమొదటి రాజకీయ వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని పేర్కొన్నారు.
రాష్ట్రసాధన వరకు పలు కీలక దశల్లో టీజేఎఫ్ పోషించిన చారిత్రక పాత్ర మహోన్నతమైనదని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వ పోరాటం లో వరంగల్ జిల్లా టీజేఎఫ్ పోషించిన పాత్ర కూడా చాలా గొప్పదని అన్నారు. ఇక్కడ నుంచి జర్నలిస్టు సునీల్ ఆత్మబలిదానం చేసిన చరిత్ర ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ వేదికగా రజతోత్సవాలను నిర్వహించడంతోపాటు, అన్నిజిల్లాల జర్నలిస్టులు తరలిరావాలని తీర్మానించింది. సమావేశంలో రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టెమ్జ్) రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్ పాల్గొన్నారు.