హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై పక్కా ప్లాన్‌తోనే హత్యాయత్నం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు ప్రసాద్‌గౌడ్ రెక్కీ నిర్వహించాకే ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి జీవన్‌రెడ్డిపై ఆయన నివాసంలోనే హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడిగా ప్రసాద్‌గౌడ్, రెండో నిందితురాలిగా ఆయన భార్య, కల్లాడి గ్రామ సస్పెండెడ్ సర్పంచ్ లావణ్య పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు.
నిందితుడు ఆ తుపాకీని బీహార్ నుంచి తెప్పించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీని ఎవరు తెచ్చిచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కత్తిని నాందేడ్‌లో కొన్నట్టు గుర్తించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకొన్నాడు. కారులో తాను ఒక్కడినే వచ్చానని ప్రసాద్ చెప్తున్నప్పటికీ మరో వ్యక్తి కూడా అతనితో ఉన్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
దుర్మార్గపు చర్య : నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే జీవన్‌రెడ్డిని హత్య చేయాలని భావించడం దుర్మార్గపు చర్య అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జీవన్‌రెడ్డిపై హత్య కుట్రను తీవ్రంగా ఖండించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి వేముల ఆయనను పరామర్శించారు.