సుబేదారి(హనుమకొండ), జూన్ 19 : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలను స్థానిక పోలీసులు బేఖాతర్ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత కొండా మురళికి ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసులకు ఆయన ఇటీవలే సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. తాజాగా గురువారం కూడా ఇదే రీతిలో పోలీసులు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ సెంటర్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరయ్యారు. హనుమకొండ రాంనగర్‌లోని ఆయన ఇంటి నుంచి ఇద్దరు ఎస్సైలు మురళికి ఎస్కార్ట్‌గా వచ్చారు. పోచమ్మమైదాన్ సెంటర్లో కొండా మురళికి ఇంతేజార్గంజ్, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు షుకూర్, తుమ్మ గోపీరెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసే గంటన్నర వరకు ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, కొంతమంది సిబ్బంది అక్కడే ఉన్నారు.
వారం క్రితమే వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు బొల్లం రమేశ్, షుకూర్, గోపిరెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సైలు రోజంతా కొండా మురళికి ఎస్కార్ట్ డ్యూటీ చేశారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో ‘విధులను వదిలి-కొండా వెంట వెళ్లి’ అనే శీర్షికన శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆరా తీయగా, నిఘా వర్గాలు విచారణ చేపట్టి సీపీకి నివేదిక వచ్చారు. దీంతో కొండాకు ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసు అధికారులకు రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని మెమోలు జారీ చేశారు. ఇందుకు సదరు పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందని సీపీ రెండోసారి బుధవారం కూడా చార్జీ మెమోలు జారీ చేశారు. ఈ విషయంలో ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే కొండా వెంట పలువురు ఎస్కార్ట్‌గా వెళ్లడం చర్చనీయాంశమైంది.