హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డాటా అనలెటిక్స్ (బీబీఏడీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. డబుల్ డిగ్రీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఈ కోర్సును కొత్తగా ప్రవేశపెట్టారు. ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు బీబీఏలో చేరేందుకు అర్హులుగా పరిగణించారు. మూడేండ్ల ఈ కోర్సును ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే, బ్లెండెడ్ విధానంలో విద్యాబోధన కొనసాగుతుందని వివరించారు. కాగా, ఈ కోర్సు పూర్తైతే జాబ్ గ్యారంటీ అని నిపుణులు అంటున్నారు.
16 నుంచి తరగతులు ప్రారంభం
2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన బీబీఏ-డీఏ కోర్సు తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్టు వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. మూడేండ్ల కోర్సులో ఆరు సెమిస్టర్లు ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రతి సెమిస్టర్‌కు రూ.30 వేల చొప్పున ట్యూషన్ ఫీజు నిర్ణయించామని పేర్కొన్నారు. వివరాలకు 91542 51963ను లేదా జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.