హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువకులు, విద్యార్థులే లక్ష్యంగా కొనసాగుతున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, సూపర్విజన్ వింగ్, స్థానిక పోలీసులు ధ్వంసం చేశారు. డ్రగ్స్, గంజాయి, హషీష్ ఆయిల్, ఎల్ఎస్డీ బ్లాట్స్, ఎమ్డీఎమ్ఏ తదితర మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న మూడు ముఠాలకు చెందిన 30 మందిని అరెస్టు చేశారు. పట్టుబడినవారిలో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు కూలీలు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో వెల్లడించారు. గాజుల రామారానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సాయివిగ్నేష్ డార్క్‌నెట్ ద్వారా ఎల్ఎస్డీ బ్లాట్స్ను ఆర్డర్‌చేసి వాటిని నగరానికి తెప్పించి దావత్‌లు చేస్తున్నాడు. మిగిలిన వాటిని అధిక ధరకు విక్రయిస్తున్నాడు.
డార్క్‌నెట్‌లో సమాచారం సేకరించి శనివారం విగ్నేష్తోపాటు అతని వద్ద నుంచి డ్రగ్స్‌ను తీసుకొన్నవారిని, దావత్లో పాల్గొన్నవారిని అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. సికింద్రాబాద్ యాప్రాల్‌కు చెంది స్టాక్ ట్రేడర్ జ్వాలాపాండే డ్రగ్స్ సప్లయర్‌గా మారాడని, పాండిచ్చేరిలో ఉంటున్న నైజీరియన్ నికోలస్‌తో కలిసి దందా చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. జ్వాలా పాండేతోపాటు మరో 17 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ధూల్‌పేటకు చెందిన మహేందర్‌సింగ్ ఇతర రాష్ర్టాల నుంచి డ్రగ్స్ తెప్పిచ్చి డోర్ డెలివరీ చేస్తున్నాడని, దందాపై సమాచారం రావటంతో అతనితోపాటు నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్టు చేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు, కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు, కాలేజీల యాజమాన్యాలు పిల్లలు, ఉద్యోగులు, విద్యార్థుల ప్రవర్తనపై దృష్టిపెట్టాలని సీపీ సూచించారు. వారు మత్తుకు అలవాటుపడ్డారని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.