యాదగిరిగుట్ట స్వయంప్రతిపత్తికి కాంగ్రెస్ సర్కార్ గండి కొడుతున్నది. ఆలయ ఆదాయంపై కన్నేసి.. టీటీడీ తరహాలో ఏర్పాటైన వైటీడీఏకు మంగళం పాడుతున్నది. కొత్తగా 18మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయనుండగా.. అందులో సగం మంది అధికార పార్టీకి సంబంధించినవారే ఉండనున్నారు.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2: యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే ఇటీవల దేవాలయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔను అనే సమాధానం వస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థగా కొనసాగనున్న గుట్టకు.. గతంలో పనిచేసిన అనుభవజ్ఞులైన దేవాలయ ఉద్యోగులను బదిలీ చేయాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయ ఈవో భవానీశంకర్ లేఖ రాయడంతో త్వరలోనే ట్రస్టు బోర్డును నియమిస్తారన్న చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో అసెంబ్లీలో ఆమోదించిన చట్టం మేరకు యాదగిరిగుట్ట స్వయంప్రతిపత్తి గల సంస్థగా కొనసాగనున్నది. దాని నిర్వహణకు ప్రత్యేకంగా ఓ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయనున్నారు. త్వరలో 18 మంది సభ్యులతో ఈ ట్రస్టు బోర్డు ఏర్పాటు కానున్నది.
కాగా ఇందులో 9 మంది సభ్యులను అధికార పార్టీకి చెందినవారినే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నేతల హస్తంలోకి వెళ్లి స్వామివారి ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేత అక్కడ చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, షాపుల టెండర్లు అన్నింటా.. ఆయన అనుచరులే చలామణి అవుతున్నారు. ఉచిత దర్శనాలు, స్వామివారి ప్రసాదాలు, కొండపైకి వాహనాల అనుమతి వంటివి యథేచ్ఛగా కొనసాగిస్తూ స్వామివారి ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రస్టు బోర్డు ఏర్పాటైనా స్వామివారి ఆదాయానికి గండిపడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో కూడా పాలకమండలిని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా 18 మందితో యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు నిరుడు ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నియమించిన వ్యక్తి చైర్మన్‌గా కొనసాగనుండగా, సభ్యులుగా దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, దేవస్థాన ఈవో, వైటీడీఏ వైస్‌చైర్మన్, అనువంశికధర్మకర్త, దేవస్థానం స్థానాచార్యులతోపాటు 9 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను నియమించనున్నారు.
వీరిలో ఒక ఎమ్మెల్సీ, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గాలకు చెందినవారు, కనీసం ఒక మహిళ ఉంటారు. పాలకమండలికి సహకారం అందించేందుకు తొలి రెండేండ్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, మొదటి ఐదేండ్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సైతం సభ్యులుగా కొనసాగనున్నారు. దేవస్థాన పరిధిలో అభివృద్ధి, ఉద్యోగాల భర్తీతోపాటు పాలనాపరమైన బాధ్యతలన్నీ ఈ బోర్డే నిర్వహించనున్నది.
యాదగిరిగుట్ట దేవస్థానం పునర్నిర్మాణానంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే నిత్యాదా యం పెరుగుతున్నది. ఆదివారం ఒక్కరోజే రూ.కోటి వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయ అభివృద్ధికి ఒక్కరూపాయి కేటాయించింది లేదు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 5 శాతం పనులకు సైతం నిధులు కేటాయించలేదు. కాగా ఇటీవల యాదగిరిగుట్ట దేవస్థానం టెండర్లను గతంతో పోలిస్తే 75 శాతం తగ్గించి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు చేజిక్కించుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది.
స్వామివారిని దర్చించుకోవాలంటే ముందుగా వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. దేవస్థాన అభివృద్ధి పనులను నచ్చిన గుత్తేదారుకు అప్పగించి కమీషన్లతో జేబులు నింపుకుంటారన్న చర్చ సాగుతున్నది. ప్రస్తుతం ఉన్న వైటీడీఏను సవరించి ఉన్నతాధికారులతో యథావిధిగా కొనసాగిస్తే ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆలయ ట్రస్టు బోర్డులోని తొమ్మిదిమంది స్థానాల్లో తమ వారిని భర్తీ చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యం గా వీరు చైర్మన్ పదవిపై కన్నేసినట్టు సమాచారం. ఆ మేరకు తమ సిఫారసుల జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రికి ఇచ్చిన్నట్టు తెలిసింది. కాగా ఇంకా ఎటువంటి పదవులు లభించకుండా రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న పార్టీ నేతలను బోర్డు సభ్యులుగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు పట్టుపడుతున్నట్టు సమాచారం. ఇక బోర్డు సభ్యుల సిఫారసులు కూడా మొదలైతే.. స్వామి వారి ఆదాయానికి మరింత గండి పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానాన్ని రాష్ట్ర తొలిసీఎం కేసీఆర్ రూ.1300 కోట్ల ప్రభుత్వ ఖజానాతో ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయ పునఃప్రారంభానంతరం గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు శని, ఆదివారాలలో 50 నుంచి 70 వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. విశేష రోజుల్లో లక్షకుపైగా వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా భక్తుల సంఖ్య పెరిగినా, ఆదాయం మాత్రం పెరగడం లేదు. ప్రతి 10 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే రూ.150 టికెట్లు తీసుకుంటుండగా 8 మంది ధర్మదర్శనానికే వెళ్తున్నట్టు దేవస్థాన అధికారులు చెప్పారు. దీంతో స్వామివారి ఆదాయం పెరుగడం లేదు. దీనికితోడు ఉచిత ప్రొటోకాల్ దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖుల కోసం స్థానిక కీలక నేత కొండపైన ముగ్గురు పీఆర్వోలను నియమించారు. దీంతో పీఆర్వోల సంపాదన మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నదని తెలుస్తున్నది. ఇటీవల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రుల సిపారసుల సంఖ్య పెరిగింది. వీరి సిఫారసుతో వచ్చే వారిలో ఒకరిద్దరే టికెట్లు తీసుకుంటుండగా.. మిగతా వారిని ఉచితంగా దర్శనం చేయించడం నిత్యకృత్యంగా మారింది. వీరికి స్వామివారి లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందించే ఘటనలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతోపాటు కొండపైకి వాహనాలకు ఉచిత అనుమతులు, వేదాశీర్వచనాలు సైతం ఉచితంగా చేపట్టడం వల్ల ఆదాయం తగ్గిపోతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.