హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాహన నంబర్లు ఇకపై టీజీతో షురూ కానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్‌కు రవాణా శాఖ స్వస్తి పలికింది. కొత్త టీఎస్ నంబర్ ప్లేట్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ మేరకు టీఎస్‌గా మార్పు కోరుతూ గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖను పరిశీలించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి టీఎస్ స్థానంలో టీజీ కనిపించనున్నది. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకే టీఎస్ వర్తిస్తుంది. పాత వాహనాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మళ్లీ మొదట్నుంచి నంబరింగ్ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఖైరతాబాద్ ఆర్టీవో పరిధిలో ఇప్పటి వరకు టీఎస్09జీజీ4322 నుంచి టీఎస్09జీజీ5321 వరకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. బుధవారం వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన నంబర్లు కాకుండా మిగిలిన వాటిని రవాణా శాఖ రద్దు చేస్తుంది. మళ్లీ మొదటి నుంచి వాహన నంబర్లను ప్రవేశపెట్టబోతుంది. ఇకపై ఖైరతాబాద్ నుంచి టీజీ09ఏఏ0001 నెంబర్‌తో వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. లేదా ఎక్కడైతే టీఎస్ సిరీస్ రద్దు అవుతుందో అక్కడి నుంచి టీఎస్ స్థానంలో టీజీ చేర్చి అదే సిరీస్ పూర్తయ్యే (9999) వరకు నంబర్లు కేటాయించే అవకాశంపై కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ అంశంపై గురువారం మరింత స్పష్టత రానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో టీఎస్ స్థానంలో టీజీ చేర్చి ఆయా ఆర్టీవో పరిధి సిరీస్ కోడ్‌తో నంబర్లు కేటాయిస్తారు.