హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): నిపుణుల సేవలను బోధనలోనూ వినియోగించుకునేందుకు ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ పేరుతో నియమించుకునే వెసులుబాటు కల్పించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మరో కీలక సంస్కరణ తీసుకొచ్చింది. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌కు సేవలందించే వారిని.. వారి సేవలను వినియోగించుకునే విద్యాసంస్థలను అనుసంధానించేందుకు ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించింది.
ఈ పోర్టల్‌లో ద్వారా విద్యాసంస్థలు నిపుణుల సేవలను సులభంగా పొందవచ్చు. సోమవారం ఈ పోర్టల్‌ను యూజీసీ ప్రారంభించనున్నది. ఏదైనా సబ్జెక్టు, విభాగంలోని నిపుణుల కోసం వెతుకుతున్న ఉన్నత విద్యాసంస్థలు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ నిపుణులకు, ఉన్నత విద్యాసంస్థలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.