ULC | ‘ముందు ఓ అబద్ధం సృష్టించాలి. అందరిలో ఆందోళన రేకెత్తించాలి. అంతా అయోమయంగా చూస్తున్నవేళ.. నిజం చెప్తామంటూ దానికీ ఓ రేటు పెట్టాలి! రేవంత్ సర్కార్ ఇప్పుడు చేస్తున్నదిదే! హైదరాబాద్ మహానగరంలో 22ఏ పేరుతో నిషేధ భయోత్పాతాన్ని సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు క్రమబద్ధీకరణ కోసం మరో పథకాన్ని తెచ్చేందుకు యోచిస్తున్నది. నిషేధ భూములకు పరిష్కారంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) స్కీమ్ తెచ్చి కాసులు పిండుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో నిషేధిత భూకంపాన్ని సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాల్లోంచి కాసులు పండించుకోవాలని చూస్తున్నదా? అందుకే యూఎల్సీ పేరిట రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమస్యల్లో ఇరికించి నెపాన్ని అధికారుల మీదికి నెట్టిందా? ఇప్పుడు పరిష్కారం పేరుతో యూఎల్సీ కింద క్రమబద్ధీకరణ పథకాన్ని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నదా? నిన్నటిదాకా సజావుగా సాగిన ఆస్తుల లావాదేవీలను పునరుద్ధరించుకోవాలంటే సర్కార్‌కు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందేనా? రాష్ట్ర ప్రభుత్వం గుట్టుగా కదుపుతున్న పావులను గమనిస్తే ఇవన్నీ నిజమేననిపిస్తున్నది.
త్వరలో నగరంలోని ఆస్తులపై యూఎల్సీ బాంబు పేల్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తర్వులు జారీ చేసి నిషేధిత జాబితాలోంచి ఆస్తులను తొలగించాలంటే పథకం కింద ఫీజులు చెల్లించాలంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నదనే సమాచారం వస్తున్నది. ఇదేకాదు.. నగరంలోని పలుచోట్ల ఉన్న వివాదాస్పద యూఎల్సీ భూ పార్సిల్స్‌పై కన్నేసిన పెద్దలు క్రమబద్ధీకరణ పథకం ముసుగులో ‘సంతృప్తికరంగా’ పరిష్కరించేందుకు కూడా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కొన్నిరోజులుగా జనం 22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. నిన్నటిదాకా సజావుగా సాగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒక్కసారిగా స్తంభించిపోయి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్సీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్) కింద ప్రకటించిన వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. కాలక్రమేణా వాటిలో చాలామేరకు గత ప్రభుత్వాలు యూఎల్సీ క్రమబద్ధీకరణ పథకాలు ప్రకటించినప్పుడు ఆ మేరకు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నాయి. కొన్నిచోట్ల క్రమబద్ధీకరణ చేసుకోకుండానే లే అవుట్లు చేసి విక్రయించారు.
వాటిని లక్షలాది మంది కొనుగోలు చేయడంతో పాటు దశాబ్దాలుగా అవి చేతులు మారుతూ వస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల బడా బాబులు కొందరు, రాజకీయ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని కబ్జా చేయడంతో ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ల్యాండ్ పార్సిల్స్ కీలకమైన ప్రాంతాల్లో కోట్ల విలువ చేసేవిగా ఉన్నాయి. కొన్నిచోట్ల నకిలీ డాక్యుమెంట్లతోనూ కొందరు ఆక్రమించుకొని ఉద్దేశపూర్వకంగా వాటిని న్యాయ వివాదాల్లోకి నెట్టిన దాఖలాలూ ఉన్నాయి. అయితే ఇలాంటి వివాదాస్పద భూముల్ని ప్రభుత్వం న్యాయస్థానాల్లో గట్టిగా వాదించి స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది. దాదాపు ఈ మూడు కేటగిరీల్లో నగరంలోని యూఎల్సీ భూములు ఉన్నట్టు రిటైర్డ్ సీనియర్ రెవెన్యూ అధికారి తెలిపారు.
గతంలో క్రమబద్ధీకరించుకున్నవి, కొన్నిచోట్ల క్రమబద్ధీకరించుకోకుండా లేఅవుట్లు చేసి విక్రయించిన ప్లాట్లపై ఏండ్ల తరబడి లావాదేవీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయనే కారణంతో సామాన్య జనం వాటిని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు కేసులున్నవి, వివాదాస్పదమైనవి మినహా మిగతా వాటిపై నిన్నటిదాకా ఎలాంటి పేజీ లేదు. కానీ కొంతకాలం కిందట యూఎల్సీ అన్నింటినీ నిషేధిత జాబితాలో వేయడంతో వందలాది కాలనీల్లో లక్షలాది ఆస్తులపై నిషేధిత పిడుగు పడింది. 30-40 ఏండ్ల కిందట కట్టుకున్న ఇండ్లు, ఐదారు, అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన ప్లాటు సైతం 22ఏ జాబితాలో చేరి లావాదేవీలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసరమై, పిల్లల పెండిండ్లు, ఇతర అవసరాల కోసం వాటిని అమ్ముకునేందుకు స్లాట్లు బుక్ చేసుకున్న వారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు.
కోట్ల రూపాయల అడ్వాన్సులపై లావాదేవీలు నిలిచిపోయి జనంలో గందరగోళం నెలకొన్నది. నిషేధిత భూకంపంతో జనం రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు తీసి తమ ఆస్తులపై నిషేధిత పిడుగు పడిందా? లేదా? అని చూసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అయితే ఇదంతా అధికారుల తప్పిదంతోనే జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. పనిలో పనిగా యూఎల్సీ భూములకు సంబంధించి సమగ్ర ప్రణాళిక (కాంప్రహెన్సివ్ పాలసీ) తీసుకువచ్చి, శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టంచేశారు. దీంతో నెపం అధికారుల మీదికి నెట్టినా యూఎల్సీ భూములపై సర్కార్ తెరవెనుక ప్రత్యేకంగా దృష్టిసారించి, ఏదో కసరత్తు చేస్తున్నదనే సంకేతాలు స్పష్టంగా బయటికొచ్చాయి. ఇదే అంశంపై సీనియర్ రిటైర్డ్ అధికారులు, కొందరు రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీస్తే పలు ఆసక్తికర అంశాలు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో యూఎల్సీ భూములన్నింటినీ ఒక్కసారిగా నిషేధిత జాబితాలో ఉంచి, భూకంపం సృష్టించడం వెనుక పక్కా వ్యూహం ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా జనంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తంకావడంతో ప్రస్తుతానికి దాని అమలును వాయిదా వేస్తూ వస్తున్నట్టుగా చెప్తున్నారు.
నగరంలో వేలాది ఎకరాల యూఎల్సీ భూములకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంతో పాటు కేసీఆర్ హయాంలోనూ అమల్లోకి వచ్చిన క్రమబద్ధీకరణ పథకం కింద విముక్తి పొందిన భూములున్నాయి. అవి ప్లాట్లుగా మారి ఏండ్ల కిందటే ఇండ్లు కూడా కట్టుకున్నారు. అయితే ఆ క్రమబద్ధీకరణకు చెందిన ఉత్తర్వులు (జీవోలు, ప్రొసీడింగ్స్) కార్యాలయాల్లో ఎంతమేరకు సురక్షితంగా ఉన్నాయనే దానిపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. కొన్నిసార్లు ప్రభుత్వ జీవోల ద్వారా క్రమబద్ధీకరించగా.. మరికొన్ని యూఎల్సీ కార్యాలయాల నుంచి జారీ అయిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇంకొన్నిసార్లు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి.
గతంలో వాటిని అప్పటి భూ యజమానులు తీసుకొని లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయించగా.. ఆతర్వాత లావాదేవీలు కొనసాగాయి. అయితే ఇప్పుడు గతంలోని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇండ్లు, ప్లాట్ల యజమానుల వద్ద అందుబాటులో లేవు. ఎలాగూ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కదా! అని ఎవరూ వాటిపై పెద్దగా దృష్టిసారించలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఉంటేనే సంబంధిత భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 700కు పైగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వెయ్యికి పైగా ఇలాంటి ఉత్తర్వుల్ని అప్లోడ్ చేసినట్టు అధికారికవర్గాలు చెప్తున్నాయి.
కానీ వాస్తవానికి ఇవేనా? ఇంకెన్ని వందల్లో ఉత్తర్వులు అప్లోడ్ కాకుండా ఉన్నాయనే దానిపై అధికారుల నుంచి కూడా సరైన సమాధానం లేదు. పైగా జిల్లాల పునర్విభజనతో పాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు కొత్తగా ఏర్పడటం, పరిధి మారడంతో ఫైల్స్ చాలా వరకు కార్యాలయాల్లోనే అందుబాటులో లేవు. అంటే మొత్తంగా గతంలో అనేక దఫాలుగా వెలువడిన యూఎల్సీ క్రమబద్ధీకరణ ఉత్తర్వుల జాబితా అనేది ప్రభుత్వం వద్దనే కచ్చితంగా లేదు. దీంతో ఆ ఉత్తర్వులు లేని భూములకు సంబంధించిన ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందే అవకాశం దాదాపుగా లేనట్టేనని ఓ అధికారి తెలిపారు.
యూఎల్సీ భూములకు సంబంధించి తాజాగా మరోసారి క్రమబద్ధీకరణ పథకాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంటే గతంలో క్రమబద్ధీకరణ జరిగినా ఆ మేరకు ఉత్తర్వులు అందుబాటులో లేనట్టయితే ఇప్పుడు వాటిని మళ్లీ క్రమబద్ధీకరించుకోవాల్సిందేనని అధికారి ఒకరు స్పష్టంచేశారు. దీంతో పాటు ఏండ్ల కిందట భూ యజమానులు అమ్ముకోగా వాటిని కొనుగోలు చేసిన సామాన్యులు దశాబ్దాల కిందట ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు వాటిని నిషేధిత జాబితా నుంచి తీయాలంటే ప్రభుత్వం తీసుకువచ్చే క్రమబద్ధీకరణ పథకం కింద ఫీజులు చెల్లించాల్సిందేనని అధికారులు చెప్తున్నారు.
అంటే గతంలో యజమాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, సొమ్ము చేసుకొని వెళ్లిపోతే ఆ మూల్యాన్ని ఇప్పుడున్న వాళ్లు చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఉదాహరణకు.. ఏండ్ల కిందట గ్రామపంచాయతీ అనుమతుల పేరిట లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసిన ప్లాట్లదారులు ఎల్ఆర్ఎస్ కింద లక్షలు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నట్టుగానే యూఎల్సీ భూముల్లోని వారు కూడా ఫీజులు చెల్లించాల్సిందేనని అధికారికవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ కింద ఫీజు రిజిస్ట్రేషన్ బుక్ విలువలో 14 శాతం వరకు మాత్రమే ఉంటుందిగానీ యూఎల్సీ క్రమబద్ధీకరణ పథకం కిందకి వచ్చే సరికి తడిసి మోపెడవుతుందని సీనియర్ అధికారులు చెప్తున్నారు. ఇలా ప్రభుత్వం క్రమబద్ధీకరణ పథకం పేరిట కోట్లల్లో ఆదాయానికి స్కెచ్ వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది.
సందట్లో సడేమియాలా.. యూఎల్సీ క్రమబద్ధీకరణ పథకంలో వివాదాస్పద ల్యాండ్ పార్సిల్స్‌ను క్లియర్ చేసేందుకు కూడా అంతర్గతంగా పావులు కదులుతున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. నగరంలో చాలాచోట్ల కోట్లాది రూపాయల విలువైన యూఎల్సీ భూములపై వివాదాలున్నాయి. చాలావరకు న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. దశాబ్దాల కిందటి భూములపైనా ఇప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఘనులూ ఉన్నారు. అయితే గతంలో అవి ప్రభుత్వ భూములుగా సర్కార్ తరఫున అఫిడవిట్లు దాఖలు చేసినవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు-ప్రభుత్వం మధ్య ఉన్న భూములను ఈ పథకం ముసుగులో గట్టెక్కించేందుకు స్కెచ్ వేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బడా బాబులు, రాజకీయ నాయకులతో పాటు చాలాచోట్ల బడా నిర్మాణ కంపెనీల గుప్పిట్లో ఈ భూములున్నాయి. వాటిని ఈ పథకం ద్వారా క్రమబద్ధీకరణ చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా పలువురు అనుమానిస్తున్నారు. ఇందులో షాడో సీసీఎల్ఏ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నదనే సమాచారం కూడా అందుతున్నది.