Actor Navdeep | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటివ్ బ్యూరో (టీనాబ్) గురువారం నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని టీనాబ్ (హెచ్‌న్యూ) కార్యాలయానికి శనివారం (23న) విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది. టీనాబ్ ఇన్స్పెక్టర్ రాజేశ్ నేతృత్వంలోని బృందం గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నోటీసులను నవదీప్‌కు ఇంటి వద్ద అందజేశారు. ఇటీవల మాదాపూర్‌లోని ప్రెష్ లైవ్ అపార్టుమెంట్‌పై గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి టీనాబ్ దాడి చేయడంతో డ్రగ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో అరెస్టయిన సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నారెడ్డి, భాస్కర్ బాలాజీ, మురళీ లింక్‌లను ఆరా తీయడంతో నటుడు నవదీప్ పేరు బయటపడింది. జూబ్లీహిల్స్‌కు చెందిన నవదీప్ స్నేహితుడైన రామ్‌చంద్‌తో కలిసి డ్రగ్స్ సేవిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో రామ్‌చంద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయగా, నవదీప్ పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి నవదీప్‌ను విచారించాలని న్యాయస్థానం సూచించింది. ఇందులో భాగంగానే నవదీప్‌ను టీనాబ్ విచారించనున్నది.
మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీనాబ్ నిఘాతో మాదాపూర్ డ్రగ్ పార్టీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి వారితో సంబంధాలు ఉన్న వారందరి పేర్లను టీనాబ్ సేకరించగా 34 మంది పేర్లు బయటపడ్డాయి. ఇందులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. చాలామంది తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొందరు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఈవెంట్స్ నిర్వాహకుడు కలహర్‌రెడ్డి, స్నార్ట్ పబ్ నిర్వాహకుడు సూర్య ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, 26న పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ, అరెస్టు చేసి బెయిల్ మంజూర్ చేయాలని మరో పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
తన పేరు బయటకు రాగానే ఆందోళన చెందిన నవదీప్.. తాను ఎక్కడికీ పారిపోలేదని టీవీలకు ఫోన్ ఇన్లు ఇచ్చాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ఆదేశాలు పొందాడు. గతంలోనూ నవదీప్‌పై డ్రగ్ ఆరోపణలున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో తరుచూ ఎవరో ఒకరు డ్రగ్‌కు సంబంధించిన కేసుల్లో అరెస్టవుతున్నారు. నవదీప్‌ను విచారిస్తే మరింత మంది డ్రగ్ వినియోగదారుల పేర్లు బయటకొచ్చే అవకాశాలున్నాయి. డిమాండ్, సైప్లె లింక్‌లను తెగ్గొడితేనే డ్రగ్స్ అనేవి రాష్ట్రంలోకి రాకుండా ఉంటాయని టీనాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ మాదక ద్రవ్యాల వ్యవహారంలో కఠినంగా ఉంటున్నారు.