హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా వేచిచూస్తున్న మధ్యంతర భృతిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గం కోరింది. నూతన వేతన సవరణలకు వీలుగా పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో గడువుకు ముందే 2018 మే 18న పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేశారని, ఇటీవలే ఏపీ ప్రభుత్వం సైతం జూలైలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ దిశగా చొరవ తీసుకోవాలని కోరారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి నియామకమైన ఉద్యోగులంతా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో మగ్గి నష్టపోతున్నారని, సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దశాబ్దకాలంగా ఉద్యోగులు వేచిచూస్తున్న ఈహెచ్ఎస్ను ఉద్యోగుల ఒకశాతం చందాతో అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రా ల్లో టీఎన్జీవో సదస్సులు నిర్వహించాలని ఏకగీవ్రంగా తీర్మానించారు. సమావేశంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు ఎన్ఎస్ స్వామి, శ్యాంసుందర్, చేపూరి నర్సింహాచారి, నర్సింహారెడ్డి, మాధవి, పలు జిల్లాల అధ్యక్షులు ఎండీ ముజీబ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, రాజేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.