హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజైన మంగళవారం రాత్రి ధ్వజారోహణంతో ముగిశాయి. ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిపారు.
ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీభూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన జీయర్‌స్వామి వారి శిష్యబృందం పఠించింది. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి దంపతులు
తిరుమల శ్రీవారిని చేవెళ్ల ఎంపీ జీ రంజిత్‌రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు సీతారంజిత్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. అధిక మాసంలో వచ్చే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించడం చాలా సంతోషం కలిగించిందని రంజిత్‌రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.