హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అధిక ఫీజుల వసూళ్లపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝళిపించింది. పలు కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ. 2లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దాంతో కాలేజీలన్నీ అప్రమత్తమయ్యాయి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా దొరకకుండా ఉండేందుకు అట్టి వివరాలను రశీదుల్లో రాయడంలేదు. మిస్లీనియస్ (ఇతరాలు) ఫీజు పేరుతో రశీదులను విద్యార్థులకు ముట్టజెబుతున్నాయి. దాంతో విద్యార్థులు టీఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోతున్నది.
ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యాకోర్సుల ఫీజులను ఇటీవలే టీఏఎఫ్ఆర్సీ ఖరారుచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీజులు కాకుండా కాలేజీలు.. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు గుంజుతున్నాయని టీఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదులందాయి. దీనిని సీరియస్గా పరిగణించిన టీఏఎఫ్ఆర్సీ ఇలా నిబంధనలు అతిక్రమించి అధికంగా ఫీజులు వసూలుచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. విద్యార్థుల ఒక్కో ఫిర్యాదుపై రూ. 2లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇలా టీఏఎఫ్ఆర్సీకి 26 ఫిర్యాదులందగా ఆయా కాలేజీలకు నోటీసులు జారీచేసింది.
నిబంధనల ప్రకారం కాలేజీలు ట్యూషన్ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ వంటి 11 రకాలైన వాటితో పాటు పరీక్షలు, అకడమిక్ ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు. అయితే ఫీజులు దేనికి తీసుకొంటున్నారో రశీదుల్లో స్పష్టంగా రాయడం లేదు. కేవలం మిస్లీనియస్ ఫీజు అని మాత్రమే పేర్కొంటున్నారు. ఇటీవలే టీఏఎఫ్ఆర్సీ అధికారుల నోటీసులకు స్పందించిన 3 కాలేజీలు లిఖితపూర్వక వివరణ ఇచ్చాయి. తాము హాస్టల్ ఫీజు తీసుకున్నామని ఓ కాలేజీ చెప్పగా, మరో కాలేజీ ట్రాన్స్పోర్ట్ఫీజు అంటూ ప్రతిస్పందించాయి.
హాస్టల్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజులు అనివార్యం కావడంతో, మరో కాలేజీ టీఏఎఫ్ఆర్సీ పెంచిన ఫీజులనే తీసుకోవడంతో అధికారులేం చేయలేకపోయారు. ఇలా మిస్లీనియస్ అని కాకుండా దేనికి ఫీజు వసూలు చేస్తున్నారో స్పష్టంగా రశీదుల్లో ఉంటేనే తాము చర్యలు తీసుకొంటామని అధికారులంటున్నారు. కాలేజీల్లో యూనిఫారాలు, పుస్తకాలు విక్రయించడం వంటివి ఉల్లంఘన కిందికి వస్తాయిని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడు దేనికి కడుతున్నారో స్పష్టంగా రాయించుకోవాలని సూచిస్తున్నారు.