Fee reimbursement | ఫీజులు కడితేనే.. సర్టిఫికెట్లు..! విదేశీ చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాశతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నది. సర్కార్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం.. చదువులు పూర్తికావడం.. సర్టిఫికెట్లు చేతికందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్‌షిప్‌లకు దూరమవుతున్న విద్యార్థులు
- ఉన్నత చదువులపైనా ప్రభావం.. ఉద్యోగాలకు పోటీపడలేని దుస్థితి
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రేవంత్ సర్కార్
- పాత బకాయిలపైనా మొండికేస్తున్న వైనం.. ససేమిరా అంటున్న కాలేజీలు
- సొంతంగా ఫీజులు కట్టలేక.. సర్టిఫికెట్లు తెచ్చుకోలేక విద్యార్థుల అవస్థలు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాశతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నది. సర్కార్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం.. చదువులు పూర్తికావడం.. సర్టిఫికెట్లు చేతికందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను మోసం చేసింది. దారుణాతిదారుణంగా వంచించింది. పాత బకాయిలు చెల్లించబోమంటూ చెబుతున్నది. పాత బకాయిలతో సంబంధంలేదని మొండికేస్తున్నది. చివరగా విద్యార్థులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సర్కార్ తీరుతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా విద్యార్థులు కాలేజీకి తాళాలువేసి ఆందోళనకు దిగారు.
కాలేజీల జులుం..
ఫీజు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీ యాజమన్యాలు దూకుడు పెంచుతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీలైతే ఫీజు బాకీ లు చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు విద్యార్థులను తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. కోర్సు పూర్తైనా.. విద్యాసంవత్సరం ముగిసినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు.
విదేశీ చదువులపై ఎఫెక్ట్..
ఫీజు బకాయిలతో విద్యార్థులకు మూడు రకాల ఇబ్బందులు తప్పడంలేదు. విదేశీ చదువులు.. కొలువులు.. పై చదువులను అందిపుచ్చుకోలేని పరిస్థితులున్నాయి. కొందరు విద్యార్థులు విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లను కోల్పోయిన ఉదంతాలున్నాయి. విదేశీ చదువులకు వీసా ప్రాసెసింగ్‌కు సర్టిఫికెట్లు తప్పనిసరి. అనేక విదేశీ వర్సిటీలు మెరిట్ స్కాలర్షిప్లిస్తున్నాయి. కొన్ని వర్సిటీలు మెమోలు, మార్కుల పర్సంటేజీ ఆధారంగానే స్కాలర్షిప్లిస్తాయి. వీటిని విద్యార్థులు దూరం చేసుకోవాల్సి వస్తున్నది. విదేశీ విద్యారుణాలు పొందిన వారు.. దీనికి తోడు మళ్లీ అదనంగా అప్పులు చేయాల్సి వస్తున్నది. ఎడ్యుకేషన్ లోన్ల కోసం అపసోపాలు పడ్డ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం మళ్లీ అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొలువులొచ్చిన వారు సర్టిఫికెట్లు లేకపోవడం, కొలువు చేజారనుండటంతో అప్పులు తెచ్చి కడుతున్నారు. లక్షల్లో ఫీజు బకాయిలుండటం.. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు చేతికందే పరిస్థితి ఉండటంతో విద్యార్థుల్లో ఆ ఆనందం కనిపించడంలేదు. ఇక పై చదువులు, ఉన్నత చదువుల కోసం కూడా సర్టిఫికెట్లు కావాల్సి ఉండటంతో విద్యార్థులకు పోరాటం తప్పడంలేదు.
ఇంత ఫీజు కట్టేదెలా..?
విద్యార్థులు ఒక వేళ ఫీజులు కడుతామ న్నా.. కట్టలేనంత ఫీజులున్నాయి. మూడు, నాలుగేండ్ల ఫీజును కట్టాలంటే విద్యార్థులు వణికిపోతున్నారు. రాష్ట్రంలో 33-40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు లక్ష దాటింది. నాలుగేండ్లకు ఈ కాలేజీల్లోని విద్యార్థులు నాలుగులక్షలపైగా ఫీజు కట్టాల్సిందే. బీ ఫార్మసీ ఫీజులు కూడా లక్షల్లో ఉన్నాయి. వీటిని కట్టాలంటే విద్యార్థులు అప్పులు చేయాల్సిందే. గండిపేటలోని ఓ కాలేజీలో ఫీజు రూ.1.60లక్షలుంది. మరో కాలేజీ ఫీజు 1.40లక్షలుంది. ఈ కాలేజీల్లోని విద్యార్థులు రూ. 6లక్షలు కట్టాల్సిన పరిస్థితులున్నాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేది.. ? ఎలా కట్టేది.. ? అన్న టెన్షన్‌తో విద్యార్థులు కుమిలిపోతున్నారు.
కొన్ని ఉదాహరణలు..
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని న్యూ చైతన్య కాలేజీలో విద్యార్థులు డీఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు పొందారు. ఇంటర్ చదువులు పూర్తయ్యాక సదరు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఫీజులు కడితేనే ఇస్తామంటూ చెప్పింది. ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు చేతికందలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం చేజారడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. కాలేజీ యాజమాన్యం దిగి రాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి తాళా లు వేసి రోడ్డుపై బైఠాయించారు.
- వరంగల్ ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే విద్యార్థుల చేత బాండ్ పేపర్ రాయించుకోవడమే కాకుండా బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారు. సగం ఫీజు మొత్తాన్ని కట్టించుకుంటున్నారు.
- ఓ విద్యార్థి కోఠికి సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో మూడేండ్ల లా కోర్సు పూర్తిచేశాడు. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ యాజమాన్యం చెప్పగా, చేసేదేమీ లేక విద్యార్థి వెనుదిరగాల్సి వచ్చింది.
- కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు.
- సర్టిఫికెట్లు ఇప్పించండి.. అంటూ విద్యార్థులు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్, ఉన్నత విద్యామండలి, నాం పల్లిలోని కళాశాల విద్య కమిషనరేట్, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు ఐదు నుంచి పది మంది ఈ ఆఫీసుల ముందు కనిపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

