హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): యూనివర్సిటీలకు కొత్త వైస్చాన్స్లర్లను ఎంపికచేసే సెర్చ్ కమిటీ సమావేశాలు గందరగోళాన్ని తలపిస్తున్నాయి. వీసీల పేర్ల ను ఖరారుచేసే సెర్చ్ కమిటీ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్నాయి. శుక్రవారం జరగాల్సిన తెలంగాణ, కాకతీయ వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు రెండు వాయిదాపడ్డాయి. సెర్చ్ కమిటీ సభ్యులు అం దుబాటులో లేకపోవడం, ఆయా సభ్యుల తో సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలంకావడంతో ఈ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్నాయి. పది వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారుచేయగా, ఇప్పటి వరకు ఆరు వర్సిటీల సమావేశాలు పూర్తయ్యాయి. జేఎన్ఎఫ్ఏయూ, బీఆర్ అంబేద్కర్ వర్సి టీ, తాజాగా తెలంగాణ, కాకతీయ వర్సిటీ సెర్చ్ కమిటీల సమావేశాలు వాయిదా పడు తూ వస్తున్నాయి. శుక్రవారం జేఎన్టీయూ, శాతవాహన వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలను మాత్రమే నిర్వహించారు. ఇప్పటికే మహాత్మాగాంధీ, పాలమూరు, ఉస్మానియా, తెలుగు వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వం ఏకపక్షంగా సమావేశాల షెడ్యూల్ను ఖరారుచేయడాన్ని సెర్చ్ కమిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. సమావేశాలు జరిగిన ఆరు వర్సిటీల వీసీల నియామకంపై ముందుకెళ్లడమా? లేక.. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆగడమా? అన్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గాంధీభవన్లో శుక్రవారం నిర్వహించాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది. ముందస్తు సమాచారం లేకుండా కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారు. గంటల తరబడి పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరిగారు. ప్రజాభవన్లో శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేసినట్టు గాంధీభవన్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.