హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నియమితులయ్యే డిగ్రీ లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం పోస్టు పేరు మార్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లను ఇక నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వం 491 డిగ్రీ అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను అప్పట్లో డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టులుగా ప్రభుత్వం పేర్కొన్నది. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. డిగ్రీ అధ్యాపకుల పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పుచేస్తూ గతంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీఈ) ఉత్తర్వులిచ్చింది. యూజీసీ పేస్కేల్స్ పొందుతుండటంతో వీరిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణించింది. డిగ్రీ అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణించాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం డీఎల్ పోస్టులుగా పేర్కొంటూ 491 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. పోస్టుల పేర్లు భిన్నంగా ఉండటం, ఈ సాంకేతిక సమస్య కారణంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను జారీకి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలోనే డీఎల్ పోస్టు పేరును మార్చేందుకు విద్యాశాఖ ప్రతిపాదనల పంపగా, ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. శనివారం 491 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లుగా) పరిగణిస్తూ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది.