హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : నీట్ పీజీ ఆలిండియా కోటాను 50 నుంచి 15 శాతానికి తగ్గించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆదివారం లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్-పీజీలో ఆలిండియా కోటాపై తెలంగాణకు చెందిన అభ్యర్థులు, వైద్య విద్యార్థులు, వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి, వైద్య విద్యతోపాటు పీజీ సీట్లను గణనీయంగా పెంచిందని గుర్తుచేశారు. రాష్ట్ర నిధులు వెచ్చించి మెడికల్ కాలేజీల భూమి, భవనాలు, బోధనాసుపత్రులు, ప్రయోగశాలలు, అధునాతన పరికరాలు ఏర్పాటుచేశామని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల వైద్యవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో అధికభాగం తెలంగాణ వైద్య విద్యార్థులకు దక్కేలా నిబంధనలు ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. నీట్ యూజీలో 15 శాతం జాతీయ కోటా అమల్లో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఏఐక్యూను కూడా 15 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి రాష్ట్రం నుంచి ఏఐక్యూకు ఎన్ని ప్రభుత్వ పీజీ సీట్లు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది సీట్లు పొందుతున్నారనే అంశాలపై రాష్ట్రాల వారీగా గణాంకాలు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, అన్ని రాష్ట్రాలకు సముచిత వాటా లభించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.