హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమ క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతోపాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని హర్యానాలోని ప్రముఖ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ సీ రాజ్‌కుమార్ కేటీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. కేటీఆర్ రాక, ఆయన ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్- 2026లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా యూనివర్సిటీలో నెలకొల్పిన భారత్‌లోనే తొలి రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీ సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు.
ఈ మ్యూజియంలో రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఎదురైన పోరాటాలు, సవాళ్లు, రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, భారత ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా పలువురు ప్రముఖులు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో తన ఆలోచనలు పంచుకుంటారని యూనివర్సిటీ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అధ్యాపకులతో సంభాషించేందుకు ఆహ్వానం పంపినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులతో సంభాషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, యూనివర్సిటీ పంపిన ఆహ్వానం మేరకు కచ్చితంగా హాజరవుతానని తెలిపారు.
2009లో స్థాపించిన జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బహుళ విభాగాల, పరిశోధనాధారిత విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇకడ 16 వేల మందికిపైగా విద్యార్థులు, 1,100 మందికిపైగా పూర్తిస్థాయి అధ్యాపకులు ఉన్నారు. 50కిపైగా దేశాలకు చెందిన అధ్యాపకులు, 160 దేశాలకు చెందిన విద్యార్థులతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం, ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లోని 600కుపైగా ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కలిగి ఉన్నది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లోనూ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విశేష గుర్తింపు సాధించింది. ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్2024లో గోల్డ్ రేటింగ్ పొందడంతోపాటు, క్యూఎస్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో వివిధ విభాగాల్లో ప్రముఖ స్థానాలు దకించుకున్నది. 2020లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ‘ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదాను కూడా పొందింది.