హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో మీడియాపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు జర్నలిజం తన మూల సూత్రాలైన క్షేత్రస్థాయి రిపోర్టింగ్, పరిశోధనాత్మక జర్నలిజం, సుదీర్ఘ కథనాలు, వివరణాత్మక వార్తా విశ్లేషణకు తిరిగి రావాలని ‘ది హిందూ’ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ జర్నలిస్టు ఎన్ రామ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్‌క్లబ్స్ జాతీయ సదస్సులో నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ.. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతోపాటు జర్నలిస్టుల కోసం పారదర్శక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని సూచించారు.
డిజిటల్ మీడియా, యూట్యూబ్ చానళ్ల విస్తరణతో సంప్రదాయ జర్నలిజం పద్ధతులు ప్రాధాన్యం కోల్పోవని పేర్కొన్నారు. జర్నలిస్టులపై కేసులు, ఆన్లైన్ ట్రోలింగ్లు, బెదిరింపులు భావప్రకటనా స్వేచ్ఛకు సవాళ్లు విసురుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. జర్నలిజం కోసం జర్నలిస్టులు, పాఠకులు భాగస్వాములయ్యే కొత్త ఆర్థిక నమూనాలు అవసరమని ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రతీక్ సిన్హా తెలిపారు. ప్రింట్ మీడియా ఇప్పటికీ కచ్చితమైన, లోతైన సమాచారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నదని ‘సియాసత్’ డైలీ డిజిటల్ డెస్ ఎడిటర్ సయ్య దా ఫైజా కిర్మానీ పేర్కొన్నారు.
ఈ చర్చకు ‘ది కారవాన్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హర్తోష్ సింగ్ బాల్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి ప్యానలిస్టులుగా, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు, ‘ది వైర్’ మాజీ నేషనల్ అఫైర్స్ ఎడిటర్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్‌క్లబ్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సంగీత బరూవా పిషారోటి, జర్నలిస్ట్ ఉమా సుధీర్ మోడరేటర్లుగా వ్యవహరించారు. అతిథులను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్‌క్లబ్స్ ఉపాధ్యక్షుడు ఎస్ విజయకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల సతరించారు.
కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు ఏ రాజేశ్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఉమాదేవి, ముత్యాల సత్తిబాబు, శిగ శంకర్‌గౌడ్, ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, అమిత్ బట్టు, వనం నాగరాజు, మర్యాద రమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, దయ్యాల అశోక్, రచన ముడుంబై సహ సీనియర్ జర్నలిస్టులు, వివిధ రాష్ట్రాల ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను బలోపేతం చేయడం, జర్నలిస్టుల హకులను పరిరక్షించడం, వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా విసృ్తత కార్యక్రమాలను చేపట్టాలని ఈ సదస్సు నిర్ణయించింది.