BRS | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజలపై ప్రభుత్వం మోపేందుకు సిద్ధమైన రూ. 18,500 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అపురూప విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మంగళ, బుధవారాల్లో సంబురాలు చేసుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఎన్నడూ విద్యుత్తు చార్జీలు పెంచలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పది నెలల్లోనే రూ. 18,500 మేర విద్యుత్తు చార్జీలు పెంచేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా బహిరంగ విచారణలో పాల్గొని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఒప్పించగలిగామని కేటీఆర్ గుర్తుచేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించి విజయం సాధించడం అసాధారణ అంశమని, ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తనతో పాటు విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఈఆర్సీని కలిసి విద్యుత్తు చార్జీల పెంపును ఆపాలని కోరామని కేటీఆర్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ పాల్గొని ప్రజల తరఫున వాదనలు వినిపించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను స్వయంగా సిరిసిల్లలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని ఈఆర్సీని ఒప్పించినట్టు తెలిపారు.