హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా కోర్టు ధికరణ పిటిషన్‌ను సింగిల్ జడ్జి అనుమతించరాదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని 24 ఎకరాల భూవివాదంలో నాటి కలెక్టర్ ఎం రఘునందన్‌రావుతోపాటు శేరిలింగంపల్లి తహసీల్దార్ జే శ్రీనివాస్‌కు సింగిల్ జడ్జి విధించిన కోర్టు ధికరణ శిక్షను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ శిక్షలో భాగంగా వారిద్దరు కట్టిన రూ.2 వేల జరిమానాను తిరిగి చెల్లించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
హఫీజ్‌పేట సర్వే నంబర్ 77 లోని 24.35 ఎకరాల భూమి యజమానిగా వేదిరి రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును చేర్చాలన్న సింగిల్ జడ్జి తీర్పును అధికారులు అమలు చేయలేదు. దీంతో సదరు సంస్థ కోర్టు ధికార పిటిషన్ వేసింది. కోర్టు ధికారం కింద 2017లో ఆ ఇద్దరు అధికారులకు హైకోర్టు 2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో 4 వారాలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై అధికారులు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేయగా.. సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం రద్దు చేసింది.