హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కొత్తగా డీజీపీ పదవిని చేపట్టనున్న సీవీ ఆనంద్ నెత్తిన.. ఉద్యోగ విరమణ పొందిన మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిని కూర్చోబెట్టారా? ఆనంద్‌కు చెక్ పెట్టేందుకే శివధర్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించారా? అంటే పోలీసు వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వం.. వాటిని అరికట్టడం కోసమంటూ సలహా లు, సూచనలు ఇచ్చేందుకు శివధర్‌రెడ్డిని నియమించుకున్నది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా (ఎస్ఎస్ఏ) తాజా మాజీ డీజీపీ బీ శివధర్‌రెడ్డిని నియమించినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మూడేండ్లపాటు కొలువులో కొనసాగుతా రు.
ఈ పదవిలో ఉన్నంతకాలం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) హోదా, ఆ స్థాయి ర్యాంకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. డీజీపీతో సమానంగా నెలకు రూ.2.25 లక్షల జీతభత్యా లు, నెలకు రూ.50,000 ఇంటి అద్దె భ త్యం(హెచ్ఆర్ఏ) లేదంటే ఉచిత నివాస వసతి, ప్రత్యేకంగా ఒక ఓఎస్డీ, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉంటారు. ప్రభుత్వ వాహనం, మెడికల్ రీయింబర్స్మెంట్, ఉద్యోగ విరమణకు ముందున్న విధంగానే టీఏ, డీఏ సదుపాయాలు ఉం టాయని, ఈ ఖర్చులను హోం శాఖ బడ్జెట్ నుంచి కేటాయించనున్నామని పేర్కొన్నది.
యూపీఎస్సీ సిఫార్సుల మేరకు పూర్తిస్థాయి డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌కు చెక్ పెట్టేందుకే శివధర్‌రెడ్డిని పైస్థాయి లో నియమించారని పోలీసు వర్గాల్లో చర్చ మొదలైంది. పోలీస్ యంత్రాంగం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, డ్రగ్స్ (నారోటిక్స్) నియంత్రణ, రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై శివధర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ డీజీపీ అనురాగ్‌శర్మను కేవలం లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ కోసం మాత్రమే ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాష్ట్ర భద్రతా సలహాదారు’ అనే పోస్టును క్రియేట్ చేసి.. ఆరు అంశాలపై నిత్యం పర్యవేక్షణ, నిర్ణయాలు, సూచనలను అందించే అధికారం కట్టబెట్టినట్టు తెలుస్తున్నది. ఇన్ని కీలకమైన విభాగాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే శివధర్‌రెడ్డి.. ఇక నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడతారు. ప్రొటోకాల్ పర్యటనలు తప్ప.. డీజీపీగా సీవీ ఆనంద్ సీఎంతో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. ఐపీఎస్‌ల బదిలీలు సైతం డీజీపీ చేతుల్లో, ఆయన నిర్ణయాల్లో ఉండబోవని స్పష్టంగా అర్థమవుతున్నదంటున్నారు. ఇన్చార్జి డీజీపీలు ఉన్నప్పుడు లేని పోస్టు.. పూర్తిస్థాయి డీజీపీని నియమించినప్పుడే నియమించాలా? అని ప్రశ్నిస్తున్నారు.