హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ రూరల్: భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని జాతీయ భద్రతా కళాశాల బృందం అభినందించింది. హరితహారం మంచి కార్యక్రమమని, అర్బన్ ఫారెస్ట్ పారుల ఏర్పాటు చాలా బాగుందని ఎయిర్‌వైస్ మార్షల్ తేజ్బీర్సింగ్ ప్రశంసించారు. తేజ్బీర్ సింగ్ నేతృత్వంలో 15 మంది జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ డిఫెన్స్ కాలేజీ- ఢిల్లీ) బృందం రాష్ట్రంలో మంగళవారం పర్యటించింది. ఈ బృందం మొదట చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. ఆయన సూచనల మేరకు హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పారులపై అధ్యయనం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలోని 70 ఎకరాల ఆక్సిజన్ పారులో వాకింగ్ ట్రాక్, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, బటర్‌ఫ్లై పారు, ఔషధమొకల గార్డెన్‌ను బృందం సభ్యులు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణకు హరితహారం ద్వారా అమలుచేస్తున్న జంగిల్ బచావో..జంగిల్ బడావో కార్యక్రమాలను జాతీయ బృందానికి పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 179 అర్బన్ పార్కులను ఏర్పాటుచేశామని, తెలంగాణకు హరితహారంలో ఇప్పటివరకు 250 కోట్లకు పైచిలుకు మొక్కలు నాటామని తెలిపారు. ఊరూరా పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అర్బన్ ప్లాంటేషన్ తదితర ప్రభుత్వ చర్యలతో 17 శాతం నుంచి పచ్చదనం 24 శాతం వరకు పెరిగిందని పేర్కొన్నారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ పర్యావరణ అవసరాలను తీర్చేలా అటవీశాఖ కృషి అభినందనీయమని కితాబిచ్చింది.
ధరణి సేవలు భేష్
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ధరణి సేవలు బాగున్నాయని నేషనల్ డిఫెన్స్ కాలేజీ బృందం ప్రశంసించింది. మంగళవారం వికారాబాద్ జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల తాసిల్దార్ కార్యాలయాల్లో ధరణి అమలు తీరును 15 మంది సభ్యుల కేంద్ర బృందం పరిశీలించింది. తాసిల్దార్లతో మాట్లాడి ధరణి అమలు తీరును తెలుసుకొన్నారు. ప్రధానంగా మ్యుటేషన్, సక్సెషన్స్కు సంబంధించి నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ధరణి ద్వారా పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పనులు జరుగుతున్నాయని కొనియాడారు. వీరివెంట కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.