హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ)/హనుమకొండ: సీనియర్ పాత్రికేయు డు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా కథనాలు రాసిన కంచర్ల లక్ష్మారెడ్డి (91) వరంగల్‌లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరసాయపల్లెకు చెందిన కేఎల్ రెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదురొంటున్నారు. 1950లో ఓయూలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన తెలుగుదేశం రాజకీయ వారపత్రికతో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటినిజం, సాయంకాలం, మహానగర్ తదితర పత్రికల్లో పనిచేశారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ‘నేడు’ పేరుతో 3 నెలల పాటు ఉద్యమవార్తల ప్రచురణకు కరపత్రాన్ని వెలువరించడంతో నాటి ప్రభుత్వం కేఎల్రెడ్డికి నెలపాటు కారాగార శిక్ష విధించింది. కేఎల్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహాయ నిధి నుంచి రూ.15 లక్షలు అందజేశారు. తొలి రోజుల్లోనే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తడంతో ఒంటరిగానే ఉన్నారు. గురువారం సాయంత్రం నాగోలు శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
సీనియర్ జర్నలిస్టులు కేఎల్ రెడ్డి, వరదాచారి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నిరాడంబర జీవితాన్ని గడుపు తూ, పత్రికా రంగానికి నిస్వార్థ సేవలు అం దించారని స్మరించుకొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు చట్టం కమిషనర్ కటా ్టశేఖర్రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ఎంవీఆర్ శాస్త్రి, మాడభూషి శ్రీధర్, గోవిందరాజు చక్రధర్, ఐజేయూ అధ్యక్ష, కార్యదర్శులు కే శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్అలీ, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు కేశవరావు, ఉడయవర్లు, కొండా లక్ష్మణ్‌రావు, టీయూ జేఎఫ్ ప్రతినిధులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య సంతాపం తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ఆర్మూర్/బంజారాహిల్స్: ప్రముఖ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు గోవర్ధన సుందర వరదాచారి(92) గురువారం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 1932లో జన్మించిన ఆయన 4 దశాబ్దాలపాటు జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1956లో సబ్ఎడిటర్గా చేరిన ఆయన 40 ఏండ్లపాటు వృత్తిలో కొనసాగారు. తెలుగు విశ్వవిద్యాలయంతోపాటు అనేక వర్సిటీలు, ప్రముఖ దినపత్రికల కళాశాల్లో జర్నలిజం పాఠాలు బోధించారు. తెలుగు వర్సిటీ నుంచి ప్రతిభా, ఉగాది పురస్కారాలు అందుకొన్నారు. ప్రెస్ అకాడమి శిక్షణ తరగతుల్లో పత్రికల భాషపై ప్రసంగించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. శుక్రవారం ఉదయం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.