ఉప్మాకు తోబుట్టువు ఉప్పుడు పిండి. బియ్యప్పిండితో తయారు చేసే ఈ వంటకం తెలంగాణ గ్రామాల్లో ప్రాచీన కాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్న అల్పాహారం. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకో, సాయంత్రం స్నాక్స్ రూపంగానో, రాత్రి డిన్నర్గానో ఉప్పుడు పిండిని ఆస్వాదిస్తారు. ఉప్మాలానే పల్లీలు, పప్పులు, కరివేపాకు, పోపుగింజలతో కంటికింపుగా ఉంటుంది. నమిలే కొద్దీ రుచినిస్తూ పసందుగా అనిపిస్తుంది.
మండే ఎండలతోపాటే మామిడికాయల సీజనూ వచ్చేసింది. అప్పుడే ఆవకాయకు తొందర లేదు, మాగాయకు ముహూర్తమూ రాలేదు. అయినా, మార్కెట్లో రాసులు రాసులుగా ఉన్న మామిడి కాయలను చూడగానే ఆత్మారాముడు ఊరుకుంటాడా! కాయ గూరలకు వచ్చిన ప్రతిసారీ బేరసారాలు చేయకుండా నాలుగు కాయలు కొనడం, ఇంటికి తేవడం, పప్పులో వేయడం, పచ్చడి చేసుకోవడం, చిత్రాన్నం కలుపుకోవడం.. షరా మామూలే! ఈ పుల్లపుల్లటి మామిడికాయలతో మరో వెరైటీ వంటకాన్నీ చేసుకోవచ్చు. మామిడి తురుముకు కాస్త
బియ్యప్పిండి జోడించి.. తెలంగాణ స్పెషల్ ‘ఉప్పుడు పిండి’ రుచి చూడండిక.
మూడు కప్పుల బియ్యప్పిండికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొలతలో తేడా వచ్చిందా అంతే సంగతులు. అందుకే అనుభవం ఉన్నవాళ్లే తయారీకి పూనుకుంటారు. అమ్మమ్మలు, నానమ్మల దగ్గర అడిగి తెలుసుకునో, యూట్యూబ్‌లో చూసో చాలామంది ఆధునిక మహిళలు కూడా దీన్ని వండి వడ్డిస్తున్నారు. రొటీన్‌గా కాకుండా పుల్లదనం కోసం చివర్లో కాస్త నిమ్మరసమో, మామిడి తురుమో చల్లితే రుచి మరింత హెచ్చుతుంది.
తెలంగాణ లోగిళ్లలో సాధారణంగా వండే వంటే అయినా పోషకాల్లో మాత్రం అసాధారణమైంది. బియ్యప్పిండిలోని కార్బొహైడ్రేట్స్, మామిడిలోని పోషకాలు, పప్పుల్లోని ప్రొటీన్స్, వేరుశనగల్లోని కొవ్వులు, కరివేపాకు, కొత్తిమీరలోని అపారమైన విటమిన్స్, మినరల్స్.. అన్నీ కలిసి దీన్ని పౌష్టికాహార పట్టికలో చేర్చేశాయి. అందుకే చిన్నపిల్లలు మొదలు వయసు మళ్లినవారు సైతం నిరభ్యంతరంగా తినవచ్చు.
పచ్చి మామిడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలోని మినరల్స్ అనేక వ్యాధులను నివారిస్తాయి. పచ్చిమామిడి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా నివారిస్తుంది. అందువల్ల వేసవిలో ఎదురయ్యే అధిక వేడి దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిలో విటమిన్-సితోపాటు శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.
పచ్చి మామిడిలో షుగర్ మోతాదు తక్కువ. తరచూ తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మామిడిలోని బైల్ యాసిడ్స్ జీర్ణవ్యవస్థకు సాయపడే రసాలు, ఆమ్లాల ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో, కాలేయం పనితీరు మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.
మామిడికాయలో నిమ్మ, నారింజల్లోకంటే ఎక్కువ మోతాదులో విటమిన్- సి లభిస్తుంది. మామిడిని ఉడికిస్తే దాంట్లోని విటమిన్-సి లోపిస్తుంది. కాబట్టి, పచ్చిమామిడి కాయను సాధ్యమైనంత వరకూ అదే రూపంలో వాడుకోవాలి. సన్నగా తురిమి వంట చివర్లో జోడిస్తే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యమన్నమాట! ఇంకెందుకు ఆలస్యం మీరూ వండి వడ్డించుకోండి!